Tuesday, January 7, 2025
Homeటాప్ స్టోరీస్సర్వం హరితంలోనే....?!

సర్వం హరితంలోనే….?!

సర్దేది సంబంధీకులే..
టిక్ మార్క్ బాగోతపు మాటమంతి అక్కడే..
ఇక్కడ ఆయన… పక్కన ఆవిడ..?
బల్దియా సెటిల్ మెంట్లన్నీ వేదిక ఆ హోటల్లే..
గప్ చుప్ గా దందా..
ముడుపులు., మూటలు మారేది అక్కడి నుంచే..

అంతా హరితమయమే. అన్నీ ఆ వేదికగానే. ఆవిడగారి రక్తసంబంధీకులే అక్కడ కీ రోల్. పని కావాల్సిన వారు రావాల్సింది అక్కడికే., పర్సంటేజీలు మాట్లాడి, తెగ్గొట్టాల్సిందీ ఆ చోటే. ఫైల్ పై టిక్ మార్క్ పడాలన్నా., లేదంటే పక్కన పడేయాలన్నా ఆ ‘పచ్చని’ వాతావరణంలో పక్కపక్క కూర్చొని చర్చలు జరపాల్సిందే. ఎక్కడా అనుమానం రాదు., ఎవరికి అనుమతి ఉండదు. కేవలం బిల్లుల మంజూరు కోసం వచ్చే వారికే తెలుసు అక్కడి రహస్య మంతనం. అవసరార్థులు అలా వస్తారు., కలవాల్సిన గదిలోకి వెళ్తారు., అప్పటికే కాచుక్కూర్చున్న వారిని కలుస్తారు., సగానికి ఎక్కువ సైగలు, అతి తక్కువగా మాటలతో జరపాల్సిన తంతు జరుపుతారు., ఏమీ తెలియనట్టుగానే ఎవరి దారిన వారు బయటకు జారుకుంటారు. ఇక్కడి వరకు ఎపిసోడ్ నడిపించిన ఆ కీ మాస్టర్ లెక్కలన్నీ తేల్చుకుని అక్కగారికి చెబుతారు. అనంతరం ముఖ్యులిద్దరూ పక్కనే ఉన్న మరో విడిదిలో భేటీ జరిపి ఎవరి వాటాలు వారు సర్దేసుకుని జారుకుంటారు.
స్పాట్ వాయిస్, కార్పొరేషన్

కార్పొరేషన్ లో టిక్ మార్క్ బాగోతమిది. ఆ ఇద్దరి దగ్గర దస్కత్ దక్కాలంటే దాని ముందు తతంగం అంతా ఆ హోటల్ వేదికగా సాగించాల్సిందే. సదరు గదిలోకి వెళ్లడం, ఆయన గారితో మాటమంతి జరపడం, రేట్ ఫిక్స్ చేయడం., చెల్లింపుల వ్యవహారం తేల్చడం., అప్పగింతలు పూర్తి చేయడం.. ఇదంతా జరిగితే ఇక వారి సంతకానికి ఢోకా లేదు. ఆ ఫైల్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. స్వామి అనుగ్రహం లభిస్తే ఆటోమెటిక్ గా పనైనట్టే. దీనికి వేదిక నిలిచేది ఆ హోటలే కావొచ్చుగానీ, విచిత్రమేంటంటే అక్కడ బేరసారాలు జరిపేది మానిటర్ కు రక్తసంబంధీకులే. ఎవరెవరినో పెట్టుకుంటే ఎక్కడ ఆగమవుతామనో., లేదంటే మరెక్కడ దొరికిపోతామనో.., అదీ కాకుంటే వాళ్లెక్కడ మోసం చేస్తారనోగానీ స్వయానా తోబుట్టువులనే ఆ పనికి పురమాయించి తన, తమ స్థాయిలనే గాలికి పెట్టిన సదరు పెద్దల తీరు ఎంత చెప్పినా తక్కువే.

ఆ గదే కీలకం..
అంతా జరిగేది అక్కడే. అన్నీ చేసేది ఆయన చేతుల మీదుగానే. కార్పొరేషన్ లో బిజీగా ఉండే ఆయన సంబంధీకులు చెప్పినపనిని ఆయనగారు ఆ హోటల్ లో కూర్చుని ఎంచక్కా కానిస్తుంటారు. కాంట్రాక్టర్ కలవాలన్నా., మరే పెండింగ్ బిల్లులకు సంబంధించిన చెల్లింపులు రావాలన్నా కార్పొరేషన్ లోని సదరు పెద్దలను ప్రసన్నం చేసుకోవాలంటే ఇక్కడ ఇయన దగ్గర తెగ్గొడితేనే పని సులభం. ఈ సారు పేరుకు ఆ పెబ్బె ప్రతినిధే కావొచ్చుగానీ ఆయన ఎంత చెబితే అంతే. వాళ్ల దగ్గర పరీక్ష (పేపర్లు) పాస్ కావాలంటే హోటల్ గదిలోని ఆయన ప్రసన్నం కబురు అక్కడికి చేరాల్సిందే. ఆ గదిలోకి వెళ్లితే చొచ్చామంటే దాదాపు పని సఫలమే తప్ప విఫలమయ్యే దాఖలాలు దాదాపుగా అరుదే. అది ఆ పెద్దలకు సెంటిమెంట్ గా., బాధితులకు చేతి చములు వదిలినా సరే పనవుతుందనే ధీమాను పంచే ‘బెంచ్ మార్క్’ గా మారింది.
ఫైనల్ గా పక్క హోటల్లో..
పెబ్బే సంబంధీకుడు పొద్దంతా మూలమీది ఆ హోటల్ లో లావాదేవీలు జరిపిన తర్వాత ఆ పెద్దల ముచ్చట్లు అప్పుడు మొదలవుతాయి. పగలంతా ఆఫీస్ పనుల్లో బిజీబిజీగా గడిపి ఆలసిన వారు సాయంత్రానికో, లేదంటే కాస్త రాత్రి సమయంలోనో పక్కనఉండే మరో హోటల్ వేదికగా పిన్ టు పిన్ ముచ్చట్లు మొదలెడతారు. వచ్చిందెంతా..? పోయేదెంతా..? జరిగిందేమిటి..? ఎవరి కెంతా..? ఇలా ప్రతీది మాట్లాడుకుని ‘అణా’ పైసలతో సహా తెగ్గొట్టేసుకుని ఆ పూటకు అన్నీ ‘క్లియర్’ చేసుకుంటారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇంతా జరపడం ఓ ఎత్తైతే., ఎవరైనా సడెన్ గా కంటపడితే ఏదో పనుల విషయమై డిస్కషన్ చేశామని మొక్కుబడి మాటలు చెప్పి జారుకుంటారు. ఇలా గ్రేటర్ పనులన్నీ ఆ హోటళ్ల సాక్షిగా ఎంచక్కా చకచకా సాగుతూనే ఉంటాయి.., ఆ పెద్దల జేబులు కూడా హాయిగా నిండుతూనే ఉంటాయి. ఇది కదా ‘టిక్’ గొప్పతనం., ఇదే కదా ఆ ‘మార్క్’ మహిమ.. భళా బల్దియా.. భళా…

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments