Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్సాలు దొర.. సెలవు దొర

సాలు దొర.. సెలవు దొర

వెబ్ సైట్ ప్రారంభించిన తరుణ్ చుగ్
కేసీఆర్ సర్కార్ కు 529 రోజులు
కౌంట్ డౌన్ బోర్డుల ఏర్పాటు

స్పాట్ వాయిస్, హైదరాబాద్ తెలంగాణ సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. రాష్ర్టంలో జంతర్ మంతర్.. తాంత్రిక్ సర్కార్ నడుస్తోందన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూటకపు హామీల కేసీఆర్ సర్కారుకు బైబై చెప్పే సమయం వచ్చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో 529 రోజులే మిగిలాయని గుర్తుచేశారు. ఈ 529 రోజుల్లో.. ప్రతిదినం బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణ బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తాయని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపుతూ, బూటకపు హామీలను ఎండగడుతూ, కుటుంబవాద పాలనను గుర్తుచేస్తూ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కొనసాగుతుందని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ పాలనకు సంబంధించిన కౌంట్ డౌన్ ను లెక్కించే వెబ్ సైట్ ను తెలంగాణ బీజేపీ ప్రారంభిస్తోందన్నారు. ‘ఇకపై తెలంగాణ బీజేపీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో కేసీఆర్ కౌంట్ డౌన్ బోర్డును వినియోగిస్తామన్నారు. ప్రతీ బీజేపీ కార్యాలయం ఎదుట ఈ బోర్డును ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ‘సాలు దొర..‌ సెలవు దొర’’ (www.selavudora.com).. కేసీఆర్‌కు కౌంట్ డౌన్ వెబ్‌సైట్ ను తరుణ్ చుగ్ ప్రారంభించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. సచివాలయానికి ఎందుకు పోవటం లేదో కేసీఆర్ చెప్పగలడా? దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడ? అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ కలలను చూపించి.. బంగారు కల్వకుంట్ల కుటుంబాన్ని సాకారం చేసుకున్నారని తెలిపారు. కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ రావు సహా ఎంతోమంది కేసీఆర్ కుటుంబీకుల చేతిలో తెలంగాణ బందీగా మారిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కోసం తాము చేసిన త్యాగాలను వృథా చేసేలా కేసీఆర్ నిరంకుశంగా పాలిస్తున్నారనే ఆందోళన తెలంగాణ ఉద్యమకారుల్లో గూడుకట్టుకుందని చెప్పారు.

2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు
జూలై 1న సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన హైదరాబాద్ లో పార్టీ జాతీయ కార్యదర్శుల భేటీ జరుగుతుందని తరుణ్ చుగ్ తెలిపారు. ఇందులో 138 మంది బీజేపీ ఆఫీస్ బేరర్లు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈసందర్భంగా జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండాపై, చేయాల్సిన తీర్మానాల గురించి నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు. జూలై 2న ఉదయం బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జరుగుతుందని, అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి 3వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతాయన్నారు. దీనికి మొత్తం 340 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. జూన్ 3న సాయంత్రం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ బహిరంగ సభ జరుగుతుందని వెల్లడించారు. దీనికి 17 రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని వివరించారు.

www.selavudora.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments