కాంగ్రెస్ అలుపెరగని వేట..
పొరపాట్లు రిపీట్ కాకుండా ప్లాన్
తాజ్ కృష్ణాలో స్క్రీనింగ్ కమిటీ భేటీ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: అభ్యర్థుల ఎంపికలో ఏమాత్రం పొరపాట్లు చోటుచేసుకోకుండా గెలుపు గుర్రాలనే బరిలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఆశావహులందరి నుంచి అర్జీలు స్వీకరించిన హస్తం.. దశల వారీగా పరిశీలిస్తూ వడపోత ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు దరఖాస్తుల పరిశీలనలో తలమునకలైన ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ.. సర్వే నివేదికలు, నేతల అభిప్రాయాలు, వినతులను క్రోడీకరించింది. మురళీధరన్ నేతృత్వంలో బుధవారం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణాలో భేటీ అయ్యారు. టికెట్ అర్జీదారుల బలాబలాలు, పనితీరు, సర్వేల ఆధారంగా నివేదికతో రెడీగా ఉంది. సమావేశంలో తుది నివేదిక రూపొందించనున్నారు. సాయంత్రం సీల్డ్ కవర్ లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ నివేదికను అందించనుంది. ఇప్పటికే దాదాపు 30 మంది సభ్యులు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాలకు స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల విషయమై కసరత్తు చేస్తోంది. త్వరలోనే అన్ని నియో జకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ వెలువరించనుంది.
538 మందితో షార్ట్ లిస్ట్..
కాంగ్రెస్ టిక్కెట్ల కోసం వచ్చిన ధరఖాస్తులను తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ షార్ట్ లిస్ట్ చేసింది. 538 మంది అభ్యర్థుల జాబితాను తయారు చేసింది. ఈ జాబితాపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది. స్క్రీనింగ్ కమిటీ కసరత్తును పూర్తి చేసిన తర్వాత సీల్డ్ కవర్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను అందించనుంది. రాష్ట్రంలోని సుమారు 25 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి పేరు మాత్రమే వచ్చిందని సమాచారం. వాస్తవానికి ఈ నెల రెండో వారంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితా విడుదల కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
Recent Comments