స్కూళ్లు, కాలేజీలు అన్ని బంద్..
భారీవర్షాల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం
స్పాట్ వాయిస్, బ్యూరో: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పలు చోట్ల రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోందని అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని అన్నారు.
Recent Comments