Friday, November 22, 2024
Homeతెలంగాణస్కామ్‌లే.. స్కామ్‌లు..

స్కామ్‌లే.. స్కామ్‌లు..

స్కామ్‌లే.. స్కామ్‌లు..
మొన్న గొర్రెల పంపిణీలో..
నేడు రైతు బీమా, రైతుబంధులో..
రూ. 2 కోట్లకు పైగా స్వాహా..
స్పాట్ వాయిస్, డెస్క్: తెలంగాణలో స్కామ్‌ల వెనక స్కాములు వెలుగు చూస్తున్నాయి. మొన్నటికి మొన్న.. గొర్రెల పంపిణీ లో భారీ స్కామ్ వెలుగు చూడగా.. ఇప్పుడు రైతుబంధు, రైతు బీమా పేరిట వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు అక్రమాలకు తెరలేపి రూ.2 కోట్లు కాజేశారు. అన్నదాతల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరణించిన రైతులకు రైతు బీమా కింద రూ.5 లక్షలు, రైతుబంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా రూ.10,000 సాయం చేసింది. అయితే పథకంలో లొసుగులను అవకాశంగా మార్చుకున్న రంగారెడ్డి జిల్లా కొందర్గు మండలానికి చెందిన వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు కుంభకోణానికి తెరలేపారు. ఆ ప్రాంత పరిధిలో కొందరు అన్నదాతల వివరాలు సేకరించిన అధికారులు వారు మరణించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వాటి ఆధారంగా రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసి, సుమారు రూ.కోటి మేర పరిహారం నిధులు స్వాహా చేసినట్లు దర్యాప్తులో తేలింది. 20 మంది బతికున్న అన్నదాతలను చంపేసి, 2020 నుంచి అక్రమాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. రైతు బీమా కింద ఇచ్చే పరిహారాన్ని ఎల్​ఐసీ చెల్లించనుంది. ఆ క్లెయిమ్​ల చెల్లింపులకు సంబంధించి ఎల్​ఐసీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తుంది. ఆ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రూ.కోటికి పైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు గుర్తించింది. ఆ విషయంపై ముంబయిలోని ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో అధికారులు సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు బీమా కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే రైతుబంధు కింద రూ.కోటి నిధులు పక్కదారి పట్టినట్లు వెలుగులోకి వచ్చింది. అన్నదాతల పేరిట నకిలీ ఖాతాలు తెరవడం, దొడ్డి దారిలో నిధులు కాజేసి జేబులో వేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైతుబంధు సాయం అందాలంటే భూ యజమాని పేరు ధరణిలో నమోదై ఉండటం సహా బ్యాంకు ఖాతా, ఆధార్‌ అనుసంధానమై ఉండాలి. అంతా పక్కాగా ఉన్నా నిధులు ఎలా మళ్లించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం రూ.2 కోట్లు కొట్టేసిన వ్యవహారంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తేలడంతో అతడిని సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొందుర్గు మండలం పరిధిలోని ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను విచారించినట్లు తెలుస్తోంది. అసలు ఆ తతంగం వెనక ఎవరున్నారనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments