భద్రకాళీ శరణం మమ..
– మారుమోగిన ఆలయ ప్రాంగణం
– ఐదు టన్నుల కూరగాయలు, పండ్లతో ప్రత్యేక అలంకరణ
– అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
– ముగిసిన ఉత్సవాలు
స్పాట్ వాయిస్, కల్చరల్ : భద్రకాళీ శరణం మమ.. శాకంబరీ మాతాకీ జై అంటూ భక్తుల నామస్మరణతో భద్రకాళీ ఆలయం మార్మోగింది. వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆశాఢ శుద్ధ పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు పదహారు రోజులుగా రోజుకో అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆదివారం దాదాపు ఐదు టన్నులకు పైగా కూరగాయలు, పండ్లతో ఉదయం 3 గంటల నుంచి 9.30 గంటల వరకు సర్వాంగ సుందరంగా అలంకరించగా శాకంబరీ మాతగా దర్శనమిచ్చారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో బారులుదీరారు. ఉదయం 10 గంటలకు అమ్మవారి దర్శనానికి దేవస్థానం వారు అనుమతించగానే కట్టలు పెంచుకున్న ఆనందంతో ఆలయంలోపలికి వచ్చి శాకంబరీ దేవిని దర్శించుకొని పులకించిపోయారు. ఆలయ ప్రాంగణమంతా భద్రకాళి శరణం మమ, శాకంబరీ శరణం మమ నామ స్మరణతో మారుమోగింది.
ఆలయ ఈవో శేషుభారతి పోలీసు తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం శాకంభరీ నవరాత్రుల పూర్ణహుతి కార్యక్రమం జరిగింది. కాగా, భద్రకాళి అమ్మవారిని పండ్లు, కూరగాయలతో అలంకరించి ఆరాధించడంవల్ల కరువు కాటకాలు దరిచేరవని ప్రజల నమ్మకం. దీంతో శాకంబరీ ఉత్సవాల సమయంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢవిశ్వాసం.
కాగా, శాకంబరీ అలంకరణ హన్మకొండ టీచర్స్ కాలనీకి చెందిన ప్రముఖ పవర్ ఇన్ స్టాలేషన్స్ కాంట్రాక్టర్ డాక్టర్ మండువ శేషగిరిరావు-రేణుక దంపతులు, హైదరాబాద్ కు చెందిన ఈమని హరికృష్ణ- స్మిత దంపతుల సౌజన్యంతో జరిగింది. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర, వేంకటేశ్వర సేవా సమితి సభ్యులు న్యూలైన్లలో భక్తులకు సేవలందించారు. భద్రకాళి సేవాసమితి కన్వీనర్ అయితా గోపీనాథ్ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. కాగా శాకంబరీ మాతను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో శేషుభారతి మాట్లాడుతూ శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీసు శాఖ తోపాటు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి, సహకరించిన భక్తులకు ధన్యవాదములు చెబుతున్నామని పేర్కొన్నారు.
Recent Comments