సైదాబాద్ కు బస్సొచ్చింది..
యూత్ కృషితో గ్రామానికి ఆర్టీసీ బస్సు..
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి పలుమార్లు యువత వినతి..
యువత పట్టుదలను అభినందిస్తున్న గ్రామస్తులు..
ఎట్టకేలకు సైదాబాద్ గ్రామానికి ఆర్టీసీ బస్సు..
స్పాట్ వాయిస్, జమ్మికుంట: ఆ ఊరినే ఆనుకుని రైల్వే లైన్ ఉంటుంది. ఊరిలో పదుల సంఖ్యలో ఆటోలూ ఉంటాయి. నిత్యం వందల సంఖ్యలో ప్రజలకు పక్కనే ఉన్న పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఆ మాటకొస్తే ఆ గ్రామమే పట్టణానికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఆ గ్రామం పక్క నుంచే రోజుకు పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఇతర ఊర్లకు రాకపోకలు సాగిస్తుంటాయి. అయినా ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు అంటే ఎలా ఉంటుందో తెలియదు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ గ్రామం పరిస్థితి చుట్టూ నీరున్నా తాగడానికి పనికి రాని సముద్రం బాపతూ, అన్ని సౌకర్యాలు ఉన్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యపు స్థితి. అదే జమ్మికుంట మండల కేంద్రానికి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉన్న సైదాబాద్.
యూత్ కృషి..
యువత తలుచుకుంటే ఏమైనా చేస్తుందనే అందరికీ తెలిసి విషయమే. అలాగే సైదాబాద్ గ్రామానికే చెందిన ఎరబాటి రామకృష్ణ, కొలుగూరి విజయ్, అంబాల శంకర్, అంబాల అరుణ్ తో పాటు మరికొందరు యువకులు తమ ఆవేదనను ఒకరికొకరు పంచుకున్నారు. సిటీకి ఇంత దగ్గర ఉన్నా తమ గ్రామానికి కనీసం బస్సు రాకపోవడంపై తీవ్రంగా మదన పడ్డారు. గ్రామస్తులు కాలినడకన, సైకిళ్లు, ఇతర వాహనదారులను లిఫ్ట్ లు అడిగి వెళ్లడం, తప్పని సరి పరిస్థితుల్లో కోరపల్లి రోడ్డు వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ నుంచి ఇతర గ్రామాలకు వెళ్లి వచ్చే ఆర్టీసీ బస్సులను రెక్వెస్ట్ చేసి ఆపుకుని వెళ్లడం వంటి దృశ్యాలను చూసి చలించిపోయారు. అప్పుడే తమ గ్రామానికి ఎలాగైనా ఆర్టీసీ బస్సును తీసుకుని రావాలని సంకల్పించుకున్నారు. తీవ్ర ఆలోచనలో పడ్డారు. తమ శక్తి మేరకు అన్ని మార్గాలను అన్వేశించారు. అప్పుడే వారికొచ్చిన ఆలోచనతో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని కలిస్తేనే సమస్యకు పరిష్కారం దొరకుతుందని నిర్ణయించుకున్నారు. ఎలాగైతేనేం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని కలిసి గ్రామ సమస్యను విన్నవించుకున్నారు. ఆ యువకుల్లో వచ్చిన మంచి సంకల్పానికి అబ్బురపడిన ఎమ్మెల్సీ తప్పకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలా ఇవ్వడమే కాకుండా అప్పటికప్పుడు కరీంనగర్ ఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి సమస్యను తెలియజేశాడు.
కౌశిక్ గొప్పమనస్సు…
గ్రామ యువత ఎరబాటి రామకృష్ణ, కొలుగూరి విజయ్, అంబాల శంకర్, అంబాల అరుణ్ తన దృష్టికి తీసుకొచ్చిన సమస్య పరిష్కారానికి కౌశిక్ రెడ్డి పర్సనల్ గా తీసుకున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులను సమస్య పరిష్కారానికి సంబంధించి వాకబు చేశారు. ఎలాగైనా యువత తనకు అప్పగించిన బృహత్కార్యాన్ని నెరవేర్చాలని కంకణం కట్టుకుని సైదాబాద్ గ్రామానికి సడెన్ గా ఆర్టీసీ బస్సు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే సోమవారం ఉదయం గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్లే వరకు కూడా ఎవరికి తెలియకుండా గ్రామస్తులందరికీ కౌశిక్ రెడ్డి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఒక్కసారిగా గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడంతో గ్రామంలో సంభ్రమాశ్చార్యాలు కలిగాయి. ప్రజలంతా తమ ఊరికి ఎర్రబస్సు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. యువత సంకల్పాన్ని ఈ సందర్భంగా పలువురు మెచ్చుకున్నారు.
కౌశికన్నకు ధన్యవాదాలు..
యూత్ లీడర్ ఎరబాటి రామకృష్ణ
గ్రామానికి బస్సు తీసుకురావాలని మేమంతా అనుకున్నాం. అదే విషయమై పలుమార్లు కౌశికన్నను కలిశాం. ఊరికి బస్సు సౌకర్యం కల్పించాల్సిన ఆవశ్యకతను వివరించాం. కౌశికన్న సానుకూలంగా స్పందించారు. బస్సు వస్తుంది అనుకున్నాం కానీ, మరీ ఇంత త్వరగా అన్న ఈ పనిని పూర్తి చేస్తాడని మాత్రం అనుకోలేదు. మా మాటమీద నమ్మకంతో సైదాబాద్ కు బస్సు పంపించిన ఎమ్మెల్సీ కౌశికన్నకు రుణపడి ఉంటాం. గ్రామస్తుల తరఫున, మా యూత్ నుంచి అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్రామానికి బస్సు రావడం మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
Recent Comments