కామారెడ్డిలో విషాదం..
ఢీ కొన్న కారు..బస్సు
స్పాట్ వాయిస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో విషాదం నెలకొంది. ఘన్పూర్ వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్-1 డిపో బస్సు కామారెడ్డికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో బస్సు టైర్ పంక్చర్ కాగా.. కారు నుజ్జునుజ్జయినట్లు చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు.. కారులో నుంచి ఇద్దరు ఎగిరి బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. కారులో చిక్కుకున్న మరో ముగ్గురి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లికి చెందిన సర్వేయర్ రాధాకృష్ణ, అతని భార్య కల్పన, కుమారుడు శ్రీరామ్, వృద్ధురాలు సువర్ణ, కారు డ్రైవర్ మృతి చెందినట్లు తెలిపారు. డ్రైవర్ వివరాలు ఇంకా తెలియలేదు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments