Monday, November 25, 2024
Homeతెలంగాణరైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేస్తాం..

రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేస్తాం..

ఇక వారికే రూ.15వేల పెట్టుబడి అందిస్తాం..
స్పాట్ వాయిస్, బ్యూరో: రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. అర్హులకే రైతు బంధు ఇస్తామని శాసనసభ వేదికగా స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ‘రైతు భరోసా’పై కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకం కింద అసలు రైతుల కంటే పెట్టుబడిదారులు, అనర్హులే ఎక్కువ లాభం పొందారని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సాగు చేయని, సాగు చేయడానికి పనికిరాని కొండలు, గుట్టలు.. ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతుబంధు సాయం ఇచ్చారని చెప్పారు. రైతు బంధులో అక్రమాలను గుర్తించిన నేపథ్యంలో ఈ పథకం నిబంధనలను పున:సమీక్ష చేసి నిజమైన అర్హులకే ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఇస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రైతుబంధు పథకం ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమని, రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా.., పెట్టుబడిదారులు, బడా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతుబంధు కింద సాయం అందిందన్నారు. ఇది అక్రమమని, ఇచ్చిన జీవోకు విరుద్ధంగా పథకాన్ని వర్తింపజేయడం అనేది గత ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments