వర్షం కురిసే చాన్స్
వెల్లడించిన వాతావరణ శాఖ
హైదరాబాద్ లో అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: మండు వేసవిలో కూల్ కూల్ న్యూస్. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. వర్షాలు కురిసే సమయంలో మెరుపులు, ఉరుములు సంభవించే అవకాశం ఉందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచనున్నట్లు వాతావరణ శాఖ అధికారి శ్రావణి పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్కు ఉత్తర, పడమర వైపు మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. వర్ష సూచనలతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు.. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ కాకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
Recent Comments