Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి

ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి

కేయూ ప్రొఫెసర్లు డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ ఈసం నారాయణ
కేయూలో పీడీఎస్ యూ 50 వసంతాల స్వర్ణోత్సవ సభ
స్పాట్ వాయిస్, కేయూ : దేశ అభివృద్ధికి ప్రధాన ఆటకంగా మారిన కుల, మత, లింగ, ఆర్థిక అసమానతులను కూకటివేళ్లతో పెకిలించి దోపిడీ, పీడన, అణిచివేత లేని సమానత్వ సమాజ స్థాపనకు నేటి విద్యార్థులంతా శాస్త్రీయ దృక్పథంతో కూడిన ప్రశ్నించే తత్వాన్ని, ప్రజాస్వామిక లక్షణాలను అలవర్చుకోవాలని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ ఈసం నారాయణ పిలుపునిచ్చారు. గురువారం కాకతీయ యూనివర్సిటీలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ) ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్ యూ 50 వసంతాల స్వర్ణోత్సవ సభ ను యూనివర్సిటీ కామర్స్ సెమినార్ హాల్ లో జిల్లా అధ్యక్షుడు అలవాల నరేష్ అధ్యక్షతన నిర్వహించారు. అంతకు ముందు కేయూ మొదటి గేటు నుంచి రెండో గేటు వరకు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు. స్వర్ణోత్సవ సభకు ముఖ్య అతిథులుగా కేయూ ప్రొఫెసర్స్ డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ ఈసం నారాయణ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసఱ్ డాక్టర్ వై.వెంకయ్య మాట్లాడుతూ నేటి విద్యార్థి యువతలో ప్రగతిశీల భావాలు లోపించటం వల్ల విదేశీ పాశ్చాత్య సంస్కృతికి గురవుతున్నారని, డ్రగ్స్, మాదకద్రవ్యాలు, ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లకు గురై విలువైన నిండు జీవితాలను నాశనం చేసుకుంటూ కన్న తల్లిదండ్రులకు, సమాజానికి తీరని శోకాన్ని మిగిల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 78 సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా విద్యారంగంలో తీసుకు వస్తున్న సంస్కరణలేవీ దళిత, గిరిజన అట్టడుగు వర్గ పేదలకు ఉచిత, నాణ్యమైన, కామన్ విద్యా విధానాన్ని అందించలేక పోయాయని ఆరోపించారు. కేయూ ప్రొఫెసర్ డాక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ దేశంలో విద్య , ఉద్యోగ , ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వాల చిత్తశుద్ధి కొరవడటం వలన దేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు, వలసలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పీడీఎస్ యూ శాస్త్రీయ వైఖరితో గత 50 ఏళ్లుగా విద్యారంగ సమస్యలు మొదలుకొని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు ఎన్నో నిర్వహించిందని, విద్యార్థుల్లో, సమాజంలో ప్రగతిశీల భాజాలాన్ని నింపి, భారత విద్యార్థి ఉద్యమాలకు మార్గదర్శిగా నిలిచిందని గుర్తు చేశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా విద్యార్థుల వెతలు, తలరాతలు మాత్రం మారటం లేదని, విద్య రంగంలో కొఠారి కమిషన్ సూచనలు ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు. సభ ప్రారంభానికి ముందు పీడీఎస్ యూ విప్లవ విద్యార్థి వీరులైన జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీ పాద శ్రీహరి, బొమ్మ సాంబయ్య, కోలా శంకర్, దుస్స చేరాలు, రంగవల్లి, మధుసూదన్ రాజ్, వరహాలు, రమణయ్య, చాంద్ పాషా, మారోజు వీరన్నను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించే ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పీడీఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కంపాటి పృథ్వీ, పీడీఎస్ యూ పూర్వ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రవి, రాష్ట్ర నాయకులు ముల్క రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు, జిల్లా నాయకులు వినయ్, వంశీ, హర్ష, రవి, రాజు, అజాహర్, కేయూ నాయకులు అశోక్, నరేష్ ,పృథ్వీరాజ్, అనూష, సంగీత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments