కదిలితే ఆపతరమా..
ఎవరు ఎన్ని చేసినా కదలాలని తలచిన వారిని ఆపడం మాత్రం ఎవరితరం. వెళ్లాలని నిర్ణయం తీసుకున్నవారిని నిలువరించడం ఎలా సాధ్యం. మార్పు రావాల్సిన వారిలో వస్తే, మార్పుకే మార్పంటే ఏమిటో రుచి తెలిసేలా మౌన సన్నివేశాలు దర్శనమిస్తాయి. వినియోగించుకున్న వారు ఉండిపోతారు.., సద్వినియోగం చేసుకున్న వారు చరిత్రలో స్థిరపడతారు. అంతిమంగా ఈర్ష్య పడేలా ఉందామా., ఈసడించుకునేలా మిగులుదామా అనేది ఎవరికి వారుగా నిర్ణయం తీసుకోవాల్సిందే.
‘‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు.., ఉర్వి జనులకెల్లనుండు తప్పు..’’ అన్నట్టు ఇతరుల్లో వెతికే వారు, తమ లోపలివి అంతగా చూసుకోరు. పైగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కళ్లు మూసుకుని తాగేది పిల్లేగానీ, దానిని అదిలించే వాడు నిఘా వేసే ఉన్నాడనే విషయాన్ని మరిచిపోతే పగిలేది పిల్లి తల.., విరిగేది నిఘా పెట్టినోడి చేతిలోని కర్ర. అందరూ గమనిస్తారనేది ఎరుగకపోతే అంతకన్నా అమాయకత్వం ఉండదేమో. గమనించడం లేదనుకోవడం దాని తప్పు.., ఇబ్బందులను భరిస్తూనే బతుకుదామనుకోవడం వీరి తప్పు.
ప్రత్యేకత లేకుంటే పరమ బోరే. ఒకే తీరును పదే పదే చూడాలంటే విసుగే. అవకాశాన్ని వినియోగించుకోవడం వేరు.., సద్వినియోగం చేసుకోవడం మరోతీరు. పవర్ ఉంది కదా అని పేట్రేగిపోతే కట్ చేయడానికి అబ్జర్వర్లు ఉంటారు. అవసరంలో ఆప్తులుగా నడుచుకుంటే తరాలకు గుర్తుండేలా మిగులుతారు. అందరు చూస్తూనే ఉంటారుగానీ, సమయం వచ్చినప్పుడే దానికి చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్తారు. ప్రతీ సారి ఆవేశాలకు లోనై పలుచన కావడానికి వారేమి పొలిటీషిన్స్ కాదు.., ప్రజలు కదా.
ఎందెందు వెతికినా అందందు కలదు.., అన్నట్టు అన్ని పార్టీల్లోనూ అదే తంతు. కానీ దేనికైనా సమయం రావాలి., సమస్యలు ఉత్పన్నం కావాలి.., చిలికి చిలికి పెద్దవిగా మారాలి.., అప్పుడు మాత్రమే పైకి పటారంగా కనిపిస్తున్న లోపలి బొక్క అసలు లోతు తెలుస్తుంది. ఆ పార్టీ నేత వస్తున్నాడంటే ఈ పార్టీ వారు, ఓ పార్టీ మీటింగ్ ఉందంటే మరో కలర్ వారు దుమ్మెత్తిపోసుకోవడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. శృతిమించి పోతున్న వ్యవహారం అయినా, దానికి ఆపడానికి మాత్రం ఎవరూ సాహసించడం లేదు. అయినా, సర్దుకుని పోయే వరకే దేనికైనా మనుగడ.., ఎదురు తిరిగితే మునకే కదా.
రాహుల్ సభకు రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఆ దేశ రాయబారితో చిందులనీ, ఈ దేశ మహిళతో మందు పార్టీ అని ఏదేదో ఒకటే రచ్చ. నిజానిజాలు తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా ప్రచారకర్తలకు కావాల్సింది ఎదుటి పార్టీ నష్టం. వారి పార్టీ అధినేత చూపుల్లో ఆక్టివిస్ట్ అనే పేరు తెచ్చుకోవడం. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి శతధా ప్రయత్నాలు జరిగాయి. ఎవరికి వారుగా సాధ్యమైనంత మేరకు ఆటంకాలు సృష్టించేందుకు ముమ్మరంగానే కృషి చేశారు. కానీ, రావాల్సిన వారే భీష్మిస్తే, ఎవరు ఎన్ని చెప్పినా ప్రభావం ఏమీ ఉండదని రైతు సంఘర్షణ సభ జనాలను చూస్తే తెలిసిపోయింది.
కళ్యాణం వచ్చినా.., కక్కొచ్చినా ఆగదంటారూ.., ఆపడం కష్టమే. అలాగే ఊపొచ్చినా., జనం కదులాలని భీష్మించినా ఆపడం ఎవరి తరం కాదు. అచ్చంగా నిన్నటి రైతు సంఘర్షణ సభలో ఇదే దృశ్యమాలిక కనిపించింది. హస్తం అంటేనే మాస్ ఫాలోయింగ్ ఉన్న పార్టీ. క్షేత్రస్థాయిలో దానికున్న బలాన్ని ఢీకొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ మాటకొస్తే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ స్థాయిలో బలం లేదనేది నిజం. అంతటి బలమైన కాంగ్రెస్ పార్టీకి యువకెరటం రేవంత్ రెడ్డి టీపీసీసీగా బాధ్యతలు స్వీకరించడం ఇప్పుడు బాగా కలిసొస్తున్న అంశం. నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన కేడర్ కు కొత్త శక్తిని అందించి కదనరంగానికి సిద్ధం చేస్తున్నాడు.
కాంగ్రెస్ అంటేనే ఓ మహా సముద్రం. కలిసే నీరు కలుస్తుంది.., పోయేది పోతూనే ఉంటుంది. ఎవరి దారి వారిది. ఎందరొచ్చినా.., ఎందరు వెళ్లినా దాని బలం అంతే. తొణికేది లేదు.., బెణికేది అంతకన్నా కాదు అనేది చరిత్ర చూస్తే అర్థమవుతుంది. పార్టీ ఆదేశాలను శిరసావహించినట్టు అనిపిస్తున్నా అంతగా కనిపించేది మాత్రం ఉండదు. క్రమశిక్షణ చర్యలు కూడా అంతంత మాత్రమే అనే బ్యాడ్ ఒపీనియన్ కూడా ఆ పార్టీ అధిష్టానంపై ఉంది. ఇలాంటి సమయంలోనే పార్టీ ఉపాధ్యక్షుడు వచ్చే సభా ఏర్పాట్లలో కూడా లుకలుకలు కొన్ని కనిపించాయి.
ఏర్పాట్ల వేళ ప్రత్యక్షంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో కనిపించిన చిత్రాలు బహువిచిత్రం. ఎవరికి వారుగా వేదికపై ఊకదంపడు.., మీడియా ముందు ముఖం చూపుడూ, ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు ఫొటోలు షేర్ చేసుడే సరిపోయిందనేది నిజం. ఎవరు ఎన్ని చేసినా కదలాలని తలచిన వారిని ఆపడం మాత్రం ఎవరితరం. వెళ్లాలని నిర్ణయం తీసుకున్నవారిని నిలువరించడం ఎలా సాధ్యం. మార్పు రావాల్సిన వారిలో వస్తే, మార్పుకే మార్పంటే ఏమిటో రుచి తెలిసేలా మౌన సన్నివేశాలు దర్శనమిస్తాయి.
ఎవరికి వారుగా ఒక్కరే అనుకున్నారో ఏమోగానీ, ఫైనల్ గా మైదానం నిండింది. నగరం జనసంద్రం అయింది. పెద్ద లీడర్లు అంతగా పనిగట్టుకుని ప్రజల తరలింపునకు చర్యలు తీసుకున్నట్టు కనిపించకపోయినా, పాత అభిమానమో, కొత్తగా మళ్లీ కావాల్సిన అవసరమో గానీ భారీ కదలిక. ఎవరూ ఊహించనది జరిగింది.., ఊహకందనిదే సాకారం అయ్యింది. ఈ విషయంలో ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టడంతో అధికార పక్షం సాధ్యమైనంత వరకు సక్సెస్ సాధించిన మాట నిజమే కానీ, కష్టాన్ని ఇష్టంగా భావించుకున్న వాడికి అడ్డంకులేమీ అతీత కష్టాలు కాదు కదనేది తేలిపోయింది. వినియోగించుకున్న వారు ఉండిపోతారు.., సద్వినియోగం చేసుకున్న వారు చరిత్రలో స్థిరపడతారన్నట్టుగానే, ఈర్ష్య పడేలా ఉందామా., ఈసడించుకునేలా మిగులుదామా అనేది నిన్నటి సభతో ఫుల్ క్లారిటీ వచ్చింది.
రెండు దఫాల కారు ప్రయాణం ప్రజలకు కాస్త మొత్తినట్టే అనిపిస్తున్న ఛాయలు ప్రస్తుత పోకడలను చూస్తే అర్థమవుతోంది. కొత్తొక వింత పాతొక రోత అనేది సర్వసాధారణం. అలాగే, ఒకే విధమైన జర్నీ చేసి చేసి బోర్ కొడితే అందరూ ఛేంజ్ కోరకుంటారనేది వాస్తవమే. అందునా రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరుగొచ్చు. ఇప్పుడు అన్ని రంగాల ప్రజలు ఎడతెగని నిరాశతో నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. అందుకే రెండు దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబ వ్యక్తి మొదటిసారి పాల్గొనే ప్రసంగాన్ని వినడానికి మార్పు కోరుకుంటున్న ప్రజలు భారీగా తరలివచ్చారు. అనుకున్నట్టుగానే రాహుల్ కూడా ఎంతో క్లియర్ గా మనస్సులోని మాటలను బల్లగుద్దినట్టుగా బయటపెట్టేశాడు. ఆయన మాటల్లోని ఆంతర్యం ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పకనే చెప్పింది. డైలామాలన్నీ పటాపంచలు చేస్తూ, అనుసరించబోయే అన్ని వ్యూహాలను ముందుంచాయి.
రైతుల కళ్లల్లో ఆనందం చూడడం, వారి కుటుంబాలకు భరోసా నింపడమే ప్రధాన ఎజెండాగా, రాబోయే ఎన్నికల నాటికి తమ రణనినాదం కూడా అదే అనే మాటలు కూడా ప్రజలకెక్కించి వెళ్లారు. ఎన్నో ఆశలతో ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన ప్రజలకు ఆయన మాటలు చిరుజల్లును తలపించాయి. తమ రాతలు తాము లిఖించుకునేందుకు అన్ని పార్టీలు ఇస్తున్న ఆప్షన్లలో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుని, ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారా.., లేదంటే సద్వినియోగం చేసుకుని చరిత్రలో మిగిలిపోతారా అనేది తేల్చుకోవాల్సింది ఇంకా సమయమున్న యుద్ధంలో ఫలితాన్ని డిక్లేర్ చేసే సత్తా ఉన్న ప్రజలు మాత్రమే.
–రాజేంద్ర ప్రసాద్ చేలిక
ఎడిటర్, స్పాట్ వాయిస్
Recent Comments