Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్శీలానికి వెల కట్టిన పెద్దమనుషులు

శీలానికి వెల కట్టిన పెద్దమనుషులు

పెళ్లి చేసుకుంటానని యువతిని మోసగించిన టీఆర్ఎస్ నేత
పరిహారంగా రూ.2 లక్షలు చెల్లించాలని ఊరి దొర తీర్పు
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
మహబూబాద్ జిల్లా పెద్దముప్పారంలో ఘటన

స్పాట్ వాయిస్, మహబూబాబాద్: పల్లెల్లో పెద్దమనుషుల తీర్పులు అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఓ వైపు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చట్టాలు తెస్తున్నా.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండతో కొందరు చోటా మోటా లీడర్లు బరితెగిస్తున్నారు. పంచాయితీ పెద్ద మనుషుల తీర్పు, అధికార పార్టీ యువనేత కామానికి ఓ యువతి బలైన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పెద్ద ముప్పారం గ్రామంలో చోటు చేసుకుంది. పెద్దముప్పారం గ్రామానికి చెందిన కొండ లింగమల్లు దంతాలపల్లి మండల టీఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శిగా, మహబూబాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్ రెడ్డి దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లింగమల్లు అదే గ్రామానికి చెందిన పోలేపల్లి శరణ్య(23)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికవాంచ తీర్చుకుని ముఖం చాటేశాడు. నాలుగేళ్లుగా శారీరకంగా వాడుకుని తీరా పెళ్లికి ఒప్పుకోక పోవడంతో బాధిత యువతి తన తల్లిదండ్రులతో కలిసి అదే గ్రామానికి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్ రెడ్డిని ఆశ్రయించింది. అయితే సదరు యువకుడికి బుద్ధి చెప్పి యువతికి న్యాయం చేయాల్సిన పెద్ద మనుషులు ఆమె శీలానికి వెల కట్టారు. గత నెల రెండో వారంలో లింగమల్లు రూ.2 లక్షలు చెల్లించాలని పెద్దమనిషులు తీర్పునిచ్చారు. తనకు డబ్బులు వద్దని, లింగమల్లునే పెళ్లి చేసుకుంటానని బాధితురాలు చెప్పినా వారు వినలేదు. ఈ క్రమంలోనే ఇటీవల వెంకటేశ్వర్ రెడ్డి గడీలో పంచాయితీ పెట్టి పెళ్లికి ఆర్నెళ్ల గడువు విధించారు. పెళ్లి చేసే ఉద్దేశం ఉంటే వెంటనే చేయాలని, కానీ సదరు యువకుడిని కాపాడేందుకే ఇలా చేస్తున్నారని, తనకు అన్యాయం చేశారని ఆవేదనకు గురైన శరణ్య మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు సూసైడ్ లెటర్ రాసింది. ఈ ఘటనతో ఊరంతా తరలివచ్చి యువతి శవాన్ని యువకుడి ఇంటి ఎదుట ఉంచి ధర్నా చేశారు. ప్రేమించి మోసగించిన లింగమల్లును, పంచాయతీ చేసిన పెద్దమనుషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి యువతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువతి మృతిపై లిఖితపూర్వక ఫిర్యాదు అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మురళీధర్‌రాజు తెలిపారు.

యువతి రాసిన లేఖ
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లతో.. మోసగించిన యువకుడు

RELATED ARTICLES

Most Popular

Recent Comments