Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్నాటు కొట్టుడే...

నాటు కొట్టుడే…

నాటు కొట్టుడే…
పీఎస్ కొస్తే పీస్.. పీసే..
దంచి కొడుతున్న ఎస్సై లు..
అల్పులపై వీరావేశం..
మొన్న రేగొండ, నిన్న బయ్యారం..
పేరుకే ఫ్రెండ్లీ.. తీరు అగ్లీ..
విమర్శల పాలవుతున్న పోలీసుల వ్యవహారం

స్పాట్ వాయిస్, ఓరుగల్లు: తప్పు చేయడం మానవ సహజం. కొందరు కావాలని తప్పులు చేస్తే, మరికొందరు అనుకోకుండా చేస్తారు. ఏదైనా తప్పు తప్పే. తప్పును సరిదిద్దాల్సిన వారిని, తప్పుడు బాటలో వెళ్తున్న వారిని సక్రమంగా నడిచేలా చేయాల్సిన వ్యవస్థలోని కొందరు వ్యక్తులు కూడా అప్పుడప్పుడు తప్పులు చేసి విమర్శల పాలవుతున్నారు. అందుకు ఉదాహరణే కొన్ని రోజుల కిందట ఖమ్మంలో మహిళా అనుమానాస్పద మృతి ఘటన, మొన్న రేగొండలో ఓ వ్యక్తిని కుళ్లబొడిచిన ఎస్సై వ్యవహారం, నిన్న బయ్యారంలో మరో వ్యక్తిని తీవ్రంగా హింసించిన మహిళా అధికారి ఉదంతం.
బాదేస్తున్నారు..
బుద్ధి చెప్పాల్సిన అధికారులు గొడ్డును బాదినట్టు బాదుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. భార్యభర్తల మధ్య మనస్పర్థాలు సహజం. దానిని కౌన్సిలింగ్ ద్వారానో, లేదంటే భయపెట్టో చక్కదిద్దాల్సిన పోలీసు అధికారులు లాఠీలు విరగ్గొడుతున్నారు. ఒళ్లంతా హూనమయ్యేలా నాటుకొట్టుడు కొడుతున్నారు. ఒకానొక దశలో పోలీసులను ఆశ్రయించిన బాధితులే అనవసరంగా గొడవను పెద్దది చేసుకున్నామురా దేవుడా అనేలా వ్యవహరిస్తున్నారు. అనుక్షణం విధినిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సింది ముమ్మాటికి పోలీసులే. సమాజ పోకడ గతి తప్పకుండా చూడాల్సిన గురుతర బాధ్యత కూడా వారిపైనే ఉంది. అంతటి ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటూ, ప్రజలను కష్టాల పాలు చేసే కొందరు అధికారుల తీరుతో వ్యవస్థకే మరకలు అంటుతున్నాయి. రోజంతా హైలీ టెన్షన్ వాతావరణంలో విధినిర్వహణలో ఉండే పని పోలీసులది. ఎక్కడేం జరిగినా ప్రాథమికంగా వెళ్లాల్సింది కూడా వారే. అంతమాత్రన ఎక్కడెక్కిడి కోపాన్నో అల్పులపైన ప్రదర్శిస్తూ, వారి జీవితాలపై శాశ్వతంగా ప్రభావం చూపేలా గొడ్డును బాదినట్టు బాదడం ఏమాత్రం సరికాదని ప్రజలు వాపోతున్నారు. న్యాయం చేయాల్సిన ఖాకీలే అన్యాయంగా విరుచుకపడితే ఎవరికి చెప్పుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
మొన్న రేగొండలో..
కొద్ది రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని జూబ్లీనగర్ కు చెందిన శ్రీనివాస్ పై ఎస్సై శ్రీకాంత్ రెడ్డి అకారణంగా దాడి చేసి రక్తం కక్కుకునేలా కొట్టాడు. పోలీసులకే ఎదురు మాట్లాడుతావా అంటూ చితకబాదాడు. ఈ ఘటనపై డీఎస్పీ సంపత్ రావు విచారణ చేపట్టారు. ఈ దాడిలో పక్కటెముకలు విరిగాయని బాధితుడు చెబుతుండగా.. ఆ ఇంటి ఆడబిడ్డ పెళ్లి సైతం ఆగిపోయింది. ఖమ్మం జిల్లాలోనూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో మృతి చెందడం కల్లోలం సృష్టించింది.
నిన్న బయ్యారంలో..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్యక్తిని చితకబాదడంతో బాధితుడు నడవలేని స్థితికి చేరుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవ విషయంలో బానోతు మురళి అనే వ్యక్తిపై కేసు నమోదైంది. కేసు విషయమై బయ్యారం ఎస్సై రమాదేవి స్టేషన్‌కు పిలిపించారు. అతడిని తీవ్రంగా కొట్టడంతో మురళీ నడవలేని స్థితికి చేరాడు. వెంటనే అతడిని బంధువులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడా..?
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ను తీసుకొచ్చింది. స్టేషన్ కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యలను సమరస్య పూర్వకంగా పరిష్కరించాలని సూచించింది. అయితే కొన్ని చోట్ల ఈ విధానం సజావుగానే సాగుతున్నా.. ఇలాంటి కొన్ని ఘటనలతో పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చిపెడుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments