ఓసీ త్రీ ప్రమాదంలో గాయపడిన అన్వర్ మృతి
గణపురంలో విషాద చాయలు
స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలోని కేటీకే ఓసీ త్రీ గనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి హైద్రాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 3న తెల్లవారు జామున ఓసి -త్రీ ప్రాజెక్టులో మట్టిలోడు అన్లోడ్ చేసి క్వారీలోకి వెళుతున్న వోల్వో టిప్పర్ పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న వోల్వో టిప్పర్ ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గణపురం మండల కేంద్రానికి చెందిన వోల్వో డ్రైవర్ అన్వర్ పాషాకు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం మొదట స్థానిక సింగరేణి ఏరియా హాస్పిటల్ తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. అక్కడ అన్వర్ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అన్వర్ మృతితో ఆ పేద కుటుంబం రోడ్డున పడింది. సింగరేణి సంస్థ తగిన ఆర్థిక సహాయం చేసి బాధిత కుటుంబానికి అదుకోవాలని గ్రామస్థులు, సహచర డ్రైవర్లు కోరుతున్నారు.
Recent Comments