Friday, April 4, 2025
Homeరాజకీయంతీన్మార్ మల్లన్నకు నోటీసులు

తీన్మార్ మల్లన్నకు నోటీసులు

తీన్మార్ మల్లన్నకు నోటీసులు
వివరణ ఇవ్వాలన్న క్రమ శిక్షణ కమిటీ
మల్లన్న కాంగ్రెస్ కు బల్లెంలా తయారయ్యాడనే విమర్శలు
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. పార్టీ లైన్ క్రాస్ చేసి.. కులగణన సర్వే నివేదికకు నిప్పు పెట్టడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. అలాఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మల్లన్న ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకుండా ఆయనపై వేటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల బీసీ కులగణన, ఇతర సామాజిక అంశాలపై తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీ నేతల అసంతృప్తికి కారణమయ్యాయి. కాంగ్రెస్‌లోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ పరువు దెబ్బతీసేలా మల్లన్న వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ హైకమాండ్‌ను పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఆయనపై అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు అధిష్టానానికి ఫిర్యాదులు అందించినట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి తీన్మార్ మల్లన్న భవిష్యత్ ఏ దిశగా మలుపు తిరుగుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
బల్లెంలా మారాడా..?
కాంగ్రెస్‌లో ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బల్లెంలా మారాడనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ చొరవతో ఎమ్మెల్సీగా ఎన్నికైన మల్లన్న కాంగ్రెస్ ముఖ్యనేతలపై విమర్శలు గుప్పిస్తుండటం.. పదేపదే వాటిని రిపీట్ చేస్తుండటంపై కాంగ్రెస్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. తాజాగా బీసీల రాజకీయ యుద్దభేరి అంటూ హడావుడి చేసిన ఆయన రేవంత్ రెడ్డే తెలంగాణకు ఆఖరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించడం.. మల్లన్న తనను తాను సీఎం క్యాండెట్‌గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేయడం మరింత వివాదాస్పదంగా తయారైంది. ఇదే గాక, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులవర్గీకరణ ఫామ్‌కు నిప్పుపెట్టడం.. తదితర కారణాల వల్లే తెలంగాణ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments