Friday, September 20, 2024
Homeతెలంగాణకాంట్రాక్ట్ లెక్చరర్లు శ్రీధర్ కుమార్ లోథ్, సదాశివ్ కు షోకాజ్ నోటీసులు

కాంట్రాక్ట్ లెక్చరర్లు శ్రీధర్ కుమార్ లోథ్, సదాశివ్ కు షోకాజ్ నోటీసులు

కాంట్రాక్ట్ లెక్చరర్లు శ్రీధర్ కుమార్ లోథ్, సదాశివ్ కు షోకాజ్ నోటీసులు

తెలుగు ప్రొఫెసర్ జ్యోతిని దుర్భాషలాడిన ఘటనపై ఇన్ చార్జీ వీసీ కరుణ, రిజిస్ట్రార్ మల్లారెడ్డి సీరియస్ 

మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు 

శ్రీధర్ ను సేవ్ చేసేందుకు మాజీ వీసీ రమేష్ తెరవెనక మంత్రాంగం 

రంగంలోకి తన టీమ్ లో పని చేసిన ప్రొఫెసర్ 

స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ జ్యోతిని దుర్భాషలాడిన ఘటనపై ఇన్ చార్జీ వీసీ వాకాటి కరుణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనకు బాధ్యులైన కాంట్రాక్ట్ లెక్చరర్లు శ్రీధర్ కుమార్ లోథ్, కర్రె సదాశివ్ కు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాంట్రాక్ట్ ఒప్పందం మేరకు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో పేర్కొంటూ మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. బుధవారం ఈ షోకాజ్ నోటీసులు వెలుగులోకి వచ్చాయి. శ్రీధర్ కుమార్ లోథ్ ను రక్షించేందుకు మాజీ వీసీ తాటికొండ రమేష్ హయాంలో ఎగ్జామ్ బ్రాంచ్ లో, హాస్టల్ ఆఫీసులో కీలక పదవులు పొందిన ఓ ప్రొఫెసర్ మధ్యవర్తిత్వం వహించి క్షమాపణ చెప్పించి మమ అనిపించే ప్రయత్నం చేసినా… చట్టం తన పని తాను చేసుకుపోవడంతో అంతా షాక్ కు గురయ్యారు. శ్రీధర్ కుమార్ లోథ్ ను రక్షించేందుకు సదరు ప్రొఫెసర్ ద్వారా మాజీ వీసీ రమేష్ తెర వెనక మంత్రాంగం నడిపిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇన్ చార్జీ వీసీ, రిజిస్ట్రార్ సీరియస్..

చేతకాకుంటే పదవికి రాజీనామా చేయాలని, కుర్చీ దిగిపోవాలని మహిళా ప్రొఫెసర్ ను బెదిరింపులకు దిగిన ఘటనపై ఇన్ చార్జీ వీసీ వాకాటి కరుణ, రిజిస్ట్రార్ మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. బాధ్యాతయుతమైన అధ్యాపక వృత్తిలో ఉండి.. సీనియర్ అధ్యాపకురాలిని బెదిరించడం, వేధించడంపై వారు విస్మయానికి గురైనట్లు తెలిసింది. బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని భావించినప్పటికీ.. లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకు తొలుత షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు సమాచారం. ప్రొఫెసర్ జ్యోతి ఫిర్యాదులో పేర్కొన్న విషయాల్లో తీవ్రత దృష్ట్యా వారిపై సస్పెన్షన్ వేటు ఖాయమనే వాదన వినిపిస్తోంది. గతంలో వీసీ రమేష్ హయాంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ ను తనను దూషించాడని ఓ ప్రిన్సిపాల్ రిజిస్ట్రార్ కు సరెండర్ చేయడంతోపాటు 42 రోజులపాటు సస్పెండ్ చేయించాడు. సారీ చెప్పినా సదరు ప్రిన్సిపాల్ కనికరించలేదని తెలిసింది. ఇప్పుడు శ్రీధర్ కుమార్ లోథ్, సదాశివ్ విషయంలోనూ అలాంటి చర్యలే తీసుకుంటారా ? లేదంటే క్షమాపణ చెప్పారు కదా అని వదిలేస్తారా అనే చర్చ క్యాంపస్ లో జోరుగా సాగుతోంది. ఒక వేళ ఇదే జరిగితే రేపు ఏ ప్రొఫెసర్ నయినా దుర్భాషలాడి తర్వాత క్షమాపణ చెప్తే సరిపోతుంది కదా అనే ధోరణి పెరుగుతుందని, ఇలాంటి పెడధోరణులను కట్టడి చేసేందుకు నెల రోజులైనా సస్పెండ్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments