మార్పు కోసమే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు..
రైతు రాజ్యం రావాలె..
అందుకే అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్.. నినాదం
నాందేడ్ సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
స్పాట్ వాయిస్, బ్యూరో: మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో కేసీఆర్ కీలక అంశాలను ప్రస్తావించారు. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, పూలే వంటి మహానీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి అని సభలో పేర్కొన్నారు. దేశ పరిస్థితులు చూసిన తర్వాత.. వాటిని మార్చేందుకు టీఆర్ఎస్ను.. బీఆర్ఎస్గా మార్చామని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత మీరంతా ఇళ్లకు వెళ్లి చర్చ చేయాలని చెప్పారు. దేశంలో భారీ మార్పు తేవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిందని, ప్రభుత్వాలు మారాయి. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు.. కానీ ఆ పలుకుల మేరకు మార్పులు రాలేదని స్పష్టం చేశారు. కనీసం తాగునీరు, విద్యుత్ ఇవ్వలేదని ఆరోపించారు. మహారాష్ట్రలో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించినా చివరకు ఆత్మహత్యలు తప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్.. నినాదంతో బీఆర్ఎస్ వచ్చిందని వివరించారు.
ఇప్పుడు సమయం వచ్చింది
ఎన్నాళ్లో ఎదురు చూశాం.. ఇక ఇప్పుడు సమయం వచ్చిందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదు.. ప్రజలు గెలవాలి, రైతులు అని సీఎం స్పష్టం చేశారు. భారత్‌లో సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ.. ప్రజలు వంచనకు గురవుతున్నారని మండిపడ్డారు. భారత్ పేద దేశం ఎంతమాత్రమూ కాదని.. భారత్ అమెరికా కంటే ధనవంతమైన దేశమని కేసీఆర్ వెల్లడించారు. భారత్‌లో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి ఇంకొకటి లేదని కేసీఆర్ పేర్కొన్నారు. దేశాన్ని 54 ఏళ్లు కాంగ్రెస్.. 16 ఏళ్లు బీజేపీ పాలించాయి.. ఇవి ఏం సాధించాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయని ఆరోపించారు. మాంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు.. చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయని పేర్కొన్నారు. దేశమంతటా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయని కేసీఆర్ ప్రశ్నించారు. నాందేడ్‌లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో లెక్కపెట్టారా? అని అన్నారు. ఇది రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటమని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ చిన్న దేశంలో ఉందని వివరించారు. ఇంత విశాల భారత్‌లో కనీసం 2,000 టీఎంసీల రిజర్వాయర్ ఎందుకు లేదని పేర్కొన్నారు.
Recent Comments