Friday, September 20, 2024
Homeటాప్ స్టోరీస్పతార పాయె...? పట్టు సడలినట్టేనా..!

పతార పాయె…? పట్టు సడలినట్టేనా..!

వన్ సైడ్ రేవంత్ వర్గానికే పోస్టులు నో
కాంగ్రెస్ విధేయులకే పదవులు
తలా ఒక పదవి పంచుకుంటున్న నేతలు
నామినేటెడ్ ఇతర పదవుల్లో సీనియర్ల పేర్లకే మొగ్గు
రేపో మాపో కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్ల ప్రకటన
పోచారం, గుత్తా అమిత్ కు పోస్టుల ప్రకటనపై సీరియస్
ఖమ్మంలో అర్థరాత్రి దాక పదవుల పందేరంపై ఏకాంత చర్చలు
రేవంత్, భట్టి, ఉత్తమ్ తలో పేరుకే మొగ్గు

స్పాట్ వాయిస్, ప్రధానప్రతినిధి: అయిపాయె.. పైనోళ్లు అంతా సల్లబడ్డట్టేనా.? పార్టీని పైకి తెచ్చినందుకు పలికిన ఘనస్వాగతాలు., చేసిన ఘనకార్యాలను మెచ్చుకుని మెడలమీదేసుకున్న వాళ్లు ఇక కిందికి దించినట్టేనా..? పతారను పాతరబెట్టిండ్రా..? హస్తినా రేంజ్ లో సారు సంపాదించుకున్న పలుకుబడి పలుచనైందా..? పదవులపై గంపెడాశతో ఉన్న ఆయన అనుయాయులకు న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిని చూస్తే నిజమని అనిపిస్తున్న పరిణామాలివి. సీఎంగా ఛర్మిషాతో వెలుగుతున్న వ్యక్తికి ఢిల్లీలో పెద్దలు, రాష్ట్రంలోని సీనియర్లు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న తీరుతో ‘విలువ’ తగ్గుతున్న చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల పంపకంలో ఎవరికి వారుగా చక్రం తిప్పుతూ, కుర్చీలు దక్కించుకునేందుకు చేస్తున్న ప్లాన్లలో ముఖ్యమంత్రి పాచికలు పారుతున్న దాఖలాలు కనుమరుగవుతున్నాయి. ఖమ్మం వేదికగా సీఎం అండ్ పలువురు కీలకమైన కేబినెట్ మంత్రుల భేటీ ‘‘మనలో మనకెందుకు భేదాభిప్రాయాలు, కలిసి సర్దుకుపోతేనే మంచిది కదా…’’ అని స్వయంగా రేవంత్ పలికిన పలుకులు ఆయన తాజా స్థాయిని తెలుపకనే తెలుపుతున్నాయి.
తొలినాళ్లలో ఉన్నంత పట్టు రోజులు గడుస్తున్నా కొద్దీ ఉండడం అసాధ్యం. సమయం సాగుతున్నా కొద్ది సహజంగానే పాత రోతవుతుంది.., కొత్త వింతవుతుంది. దగ్గరి వారు దూరంగా.., దూరపువారు దగ్గర సర్వసాధారణం. కొత్తదనానికి ఆకర్షణ ఎక్కువ., పాతకు పటుత్వం తక్కువ. రంగమేదైనా సాగినంత వరకే చెల్లుతుంది.., సాగడం ఆగితే చెల్లుచీటియే. ఒక్కమాటలో చెప్పాలంటే దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.., గాలొచ్చినప్పుడే తూర్పారా పట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేసినా ప్రయోజనం శూన్యం., ఎంత వెతికినా అవకాశం మృగ్యం.
రేవంత్ పట్టు సడలుతోందా..?
సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై ఏమో గానీ పార్టీపై, ముఖ్యంగా హైకమాండ్ వద్ద పట్టు సడలుతున్నట్టు తెలుస్తోంది. అందుకే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల పందారం ఆలస్యం జరుగుతున్నది. సీనియర్లు ఫిర్యాదులు, హైకమాండ్ కు వివరణ తర్వాత రేవంత్ రాజీ ఫార్మూలా కొచ్చినట్టు చెబుతున్నారు. హై కమాండ్ సూచన మేరకు రెండు రోజుల క్రితం ఖమ్మంలో మంత్రి పొంగులేటి నివాసంలో సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్ ఏకాంత భేటీ జరిపినట్టు తెలుస్తోంది. అంతకుముందు రోజే ఢిల్లీ హైకమాండ్ ను కలిసి హుటాహుటిన ఖమ్మం చేరుకున్న ఉత్తమ్ తో సీఎం భేటీ అయి ప్రతీ చిన్నదానికి గొడవెందుకులే అనే ధోరణిలో చర్చలు సాగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగా ముందుగా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారికి పదవులివ్వాలని నిర్ణయించారు.
పదవుల పంపకం..
వివిధ కమిషన్లకు చైర్మన్లు, సభ్యుల నియామకాల కసరత్తును దాదాపు పూర్తి చేశారు. అయితే ఒక్కో కమిషన్‌కు చైర్మన్‌, ముగ్గురు సభ్యులు కలిపి మొత్తం కనీసం నలుగురికి పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో చైర్మన్ గా పార్టీ పూర్వ విధేయులు, సభ్యులుగా తలా ఒక పేరును ప్రతిపాదించుకున్నట్టు చెబుతున్నారు. రాజకీయ పదవులకంటే కమిషన్ల నుంచి పందేరం ప్రక్రియను మొదలు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో విద్య, రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కులు తదతర కమిషన్లకు చైర్మన్లు, సభ్యుల నియామకాలపై చర్చించారు. విద్యా కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరు మురళి, రైతు కమిషన్‌ చైర్మన్‌గా కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విషయంలో తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ఎస్సీ కమిషన్‌, ఎస్టీ కమిషన్లుగా విడగొట్టాలా? లేక యథాతథంగా కొనసాగించి కొత్త చైర్మన్‌, సభ్యులను నియమించాలా..? అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు వినికిడి. సభ్యుల్లో ఎవరి వర్గానికి వారు పేర్లు తలా ఓ పేరును సూచించి నియమించబోతున్నట్టు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments