వస్తే ఎదుర్కొంటా..
30ఏళ్లలో గిట్లాంటివి ఎన్నో చూసిన
కోర్టు తీర్పులపై గౌరవం ఉంది..
బీఆర్ఎసోళ్లకు సిగ్గు లేదు..
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్థాయిలేని నాయకులంటూ చురకలు
ఎన్నికలపై తొలిసారి స్పందన..
తీవ్ర చర్చగా కడియం మాటలు
స్పాట్ వాయిస్, హన్మకొండ: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని, ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర ఆ పార్టీదని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఎమ్మెల్యే కడియం హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఇప్పట్లో ఉప ఎన్నికలు రావని… వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్‌లో ఎన్నికలు వస్తే… బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కోర్టులపై, ప్రజాస్వామ్యంపై తమకు గౌరవం ఉందన్నారు. స్థాయి లేని నాయకుల గురించి తాను మాట్లాడనని చెప్పారు.
అవినీతి, అక్రమాలకు బీఆర్ఎస్ మారుపేరని కడియం ధ్వజమెత్తారు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని, అందులో భాగంగానే జిల్లాను ఆరు ముక్కలు చేశారని, దీనిపై ప్రశ్నించినందుకే రెండో సారి నాకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ చేతిలో తెలంగాణ బందీ అయ్యిందన్నారు.
ప్రణాళికతో ముందుకెళ్తున్న..
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎజెండా పెట్టుకొని ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చినట్లు తెలిపారు. ఇచ్చిన ప్రతీ రీప్రజంటేషన్ పై సానుకూలంగా స్పందించారాని వివరించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గంగా, పేద ప్రజలు అధికంగా ఉన్న నియోజకవర్గంగా ఉందని అన్నారు. 10ఏళ్లలో నియోజకవర్గంలో రాజకీయ అవినీతి, అక్రమాలు రాజకీయం అంటే పదవులు, పథకాలు అమ్ముకోవడం అనే విధంగా చేశారని, కాని ఇప్పుడు రాజకీయం అంటే సంక్షేమం, ప్రజా సేవ, నీతి నిజాయితీ అనే కొత్త నిర్వచనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే నిజాయితీగా పని చేస్తూ రూపాయి ఆశించకుండా అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. కష్టపడి పని చేసే వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు.
100 పడకల ఆస్పత్రి..
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి రావాలంటే 100పడకల అస్పత్రి నిర్మించాలని దానికి నిధులు, ఆర్టీసీ ల్యాండ్ అలాట్ మెంట్ చేయాలని కోరగానే సానుకూలంగా స్పందించిన సీఎం కలెక్టర్ కు సైతం ఆదేశాలు జారీ చేశారాని అన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయింది కాని కార్యాలయాలు లేవని చెప్పగానే సీఎం సానుకూలంగా స్పందించారని, అలాగే ఇంటిగ్రెటెడ్ స్కూల్ ఏర్పాటులో ఘనపూర్ నియోజకవర్గానికి అవకాశం కల్పిస్తానని చెప్పారని వెల్లడించారు. మేజర్ గ్రామ పంచాయతీ అయినా ఘనపూర్ ను మున్సిపాలిటీ గా అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పడంతో వెంటనే సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. నీటి పారుదల శాఖకు సంబంధించి తెలిపిన పనులన్నింటిని వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. నవంబర్ నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టారాని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments