Friday, November 22, 2024
Homeటాప్ స్టోరీస్పార్లమెంట్‌లో ‘సెంగోల్’

పార్లమెంట్‌లో ‘సెంగోల్’

పార్లమెంట్‌లో ‘సెంగోల్’

అధికార మార్పడి సింబల్

పవిత్రతకు, న్యాయానికి గుర్తు..

రాజదండాన్ని ప్రతిష్ఠించనున్న ప్రధాని మోడీ

అరిష్టాలు రాకుండా ఏర్పాటు

28న పార్లమెంట్ ప్రారంభం..  

స్పాట్ వాయిస్, బ్యూరో :    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభం.. ఆసక్తి నెలకొల్పుతోంది. ఈ భవన ప్రారంభం సందర్భంగా ప్రపంచానికి కొత్త విషయాన్ని తెలియజేసింది. అదేంటంటే.. సాధారణంగా మనం గృహప్రవేశ సమయంలో పాలకోయ జాతికి చెందిన చెట్టు కర్రతో యంత్రాన్ని దిగువ మూలన ప్రతిష్ఠిచడం ఆనవాయితీ. దీనివల్ల ఇంటికి ఏమైనా అరిష్టాలు వస్తే వాటిని ఆ యంత్రం తొలగిస్తుందని అనాదిగా వస్తున్న విశ్వాసం. ఇప్పుడు దేశానికి సంబంధించి నిర్మించిన పార్లమెంటు భవనానికి ఎలాంటి అరిష్టాలు రాకుండా ఉండేందుకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మే 28న ఒక రాజ దండాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఆ రాజదండానికి ఏళ్ల నాటి చరిత్ర ఉంది. 1947లో బ్రిటిషర్లు మనకు స్వాతంత్ర్యం ప్రకటించి భారతదేశాన్ని విడిచి వెళ్లే ముందు అధికార మార్పిడికి గుర్తుగా దేశ తొలి ప్రధాని నెహ్రూకు రాజదండం ఇచ్చారు. ఇది ఇన్నాళ్లుగా అలహాబాద్‌లోని పురావస్తు ప్రదర్శనశాలలో ఉంది. దానిని ప్రధానమంత్రి మే 28న కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్ఠించేందుకు సిద్ధమయ్యారు.

ఇది రాజదండం చరిత్ర..

భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన తర్వాత నాటి వైస్రాయ్ మౌంట్ బాటెన్ ‘బ్రిటిషర్ల నుంచి భారతీయుల చేతుల్లోకి అధికార మార్పిడి జరుగుతోంది కదా? దానికి గుర్తుగా ఎలాంటి కార్యక్రమం చేద్దామనుకుంటున్నారు” అని నెహ్రూను అడిగారు. దీనిపై చక్రవర్తుల రాజగోపాలాచారి ( రాజాజీ) కొంత పరిశోధన చేసి అధికార మార్పిడికి సంబంధించి చోళ రాజులు పాటించిన విధానాన్ని ఎంచుకున్నారు. చోళుల్లో ఒక రాజు నుంచి మరొక రాజుకు అధికార మార్పిడి జరిగినప్పుడు రాజదండాన్ని కొత్త రాజుకు బహూకరిస్తారు. దీంతో ఆయన మద్రాసులో అప్పటికి ప్రముఖ నగల వర్తకులైన “ఉమ్మిడి బంగారు శెట్టి అండ్ సన్స్” కు దండాన్ని తయారు చేసే బాధ్యత అప్పగించారు. దాన్ని తయారుచేసిన ఉమ్మిడి ఎతి రాజులు, సుధాకర్ ఇప్పటికీ చెన్నైలో నిర్వహిస్తున్నారు. ఐదు అడుగుల ఎత్తుకుంటే ఈ బంగారు పూత పూసిన వెండి దండం పైన పవిత్రతకు, న్యాయానికి గుర్తుగా నంది ప్రతిమను చెక్కారు.

మార్పిడి జరిగింది ఇలా..

1947 ఆగస్టు 14న రాజదండ మార్పిడి తమిళ సంప్రదాయ పద్ధతిలో సాగింది. తమిళనాడులోని శైవ మఠం తిరువావడుదురై ఆధీనం ప్రధాన పూజారి అంబలవాన దేశిక స్వామి, అదే ఆధీనానికి చెందిన గాయకుడు (ఒడువర్) ఆరోజు మద్రాసు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత పూజారి ఆ రాజదండాన్ని రాత్రి 10 గంటల 45 నిమిషాల సమయంలో మౌంట్ బాటెన్ కు అప్పగించి మళ్లీ ఆయన చేతుల నుంచి తీసుకొని దాన్ని గంగాజలంతో శుద్ధి చేసి ఊరేగింపుగా ప్రదర్శన చేశారు. ఏడో శతాబ్ది నాటి తమిళ సాధువు జ్ఞాన సంబంధర్ రాసిన “కోలార్ పదిగం” అనే కవితను ఒడు వర్ పాడుతుండగా రాత్రి 11.45 నిమిషాలకు నెహ్రూ అప్పగించారు.

 

అలహాబాద్ మ్యూజియంలో..

ఆ రాజదండాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ మ్యూజియంలో నెహ్రూ వస్తువుల మధ్య ఉంచారు. ఇప్పుడు కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా మే 28న లోక్ సభ స్పీకర్ కుర్చీకి సమీపంలో దీనిని ప్రతిష్ఠిస్తారు. అయితే దీని తయారీదారులు రాజదండంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేము రాజదండం తయారు చేస్తున్నప్పుడు యువకులం. ఇప్పుడు వృద్ధులం అయిపోయాం. కానీ నాడు తయారు చేసిన రాజదండం నేడు పార్లమెంట్లో ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రతిష్ఠించడం, ఆ క్రతువును మేము కళ్ళారా చూసేందుకు అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం’ అని దీని తయారీదారులు పేర్కొన్నారు.

ప్రారంభానికి సిద్ధం..

ఉదయం 9.30లోపే పూర్తి

ప్రారంభించనున్న పీఎం మోడీ

భారత పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28న జరిగే వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్‌ను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని రెండు దశలుగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మొదటగా తెల్లవారుజామునే పాత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ క్రతువులో ప్రధాని మోడీ, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్​ సహా పులువురు సీనియర్​ మంత్రులు పాల్గొననున్నారు. పూజ అనంతరం వీరంతా లోక్​సభ, రాజ్యసభ చాంబర్లను సందర్శిస్తారు. లోక్​సభ స్పీకర్ కుర్చీ కుడి పక్కన పెట్టే సెంగోల్ అనే రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్​ను రూపకర్తలు సైతం హాజరుకానున్నారు. అనంతరం నూతన పార్లమెంట్​ ఆవరణలోనూ పూజలు చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 9.30 గంటలలోపే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments