కొత్త పింఛన్లు ముందుగా వారికే..
కొత్త దరఖాస్తులు పక్కకే..!
ముందుగా మూడేళ్ల క్రితం వాటికే..
స్పాట్ వాయిస్ , ఓరుగల్లు: కొత్త పింఛన్లు ముందుగా మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వాటికే మోక్షం కలగనుంది. కొత్తగా 10 లక్షల పింఛన్ల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో.. పెండింగ్‌లోని 3.3 లక్షల మందికి వెంటనే పింఛను మంజూరుకు కార్యాచరణ ప్రారంభించారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర కేటగిరీలకు చెందిన దాదాపు 3.3 లక్షల మంది దరఖాస్తుల పరిశీలన గతంలోనే పూర్తి చేశారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో వితంతువుల దరఖాస్తులు దాదాపు 1.68 లక్షలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులవి 68 వేలు, దివ్యాంగుల దరఖాస్తులు 57 వేలు ఉన్నాయి.
ఎంపీడీవో ల కసరత్తు..
ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. ఎంపీడీవోలు పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి, పంచాయతీ కార్యదర్శులకు సూచనలు ఇస్తున్నారు. పుట్టిన తేదీ వివరాలు సరిగా ఉన్నాయా..? ఆధార్ కార్డును అప్‌లోడ్ చేశారా..? బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తదితర వివరాల్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
8 లక్షల మంది దరఖాస్తు
వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించిన తర్వాత.. కొత్తగా అర్హత పొందిన 8 లక్షల మంది ప్రభుత్వ సూచన మేరకు మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలంటే క్షేత్రస్థాయిలో అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలి. ఇందుకోసం ఆయా దరఖాస్తులను క్షేత్రస్థాయి సిబ్బందికి అప్పగించి, పింఛన్ల విధివిధానాల మేరకు పరిశీలన చేసేందుకు ఆదేశాలు జారీ కావాల్సిఉంది. ఈ పరిశీలన తరువాత 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరయ్యే అవకాశాలున్నాయి.
Recent Comments