ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం ఏప్రిల్ 30తో ముగింపు
స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే కొత్త సీఎస్ నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ఈ క్రమంలో శాంతి కుమారి స్థానంలో కె.రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుదీర్ఘ పాలనా అనుభవం కలిగిన ఆయన గతంలో పలు ముఖ్యమైన శాఖల్లో పనిచేశారు. ఆర్థిక శాఖలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం, అత్యున్నత పరిపాలనా పదవి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
Recent Comments