తమిళనాడులోని కంపెనీలో ప్రమాదం
దుగ్గొండి మండల వాసికి గాయాలు
స్పందించిన ఎమ్మెల్యే పెద్ది
ప్రమాద ఘటన పై ఆరా
ఆదుకుంటానని కుటుంబ సభ్యులకు భరోసా
స్పాట్ వాయిస్ నర్సంపేట : దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లి గ్రామానికి చెందిన కందికొండ రజినికుమార్ తమిళనాడులోని ట్యూటికొరిన్ జిల్లాలోని ఒక కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెక్షన్ లో పని చేస్తున్నాడు. ఆదివారం తన డ్యూటీలో భాగంగా ల్యాబ్ లో పని చేస్తుండగా యాసిడ్ తో నిండి ఉన్న గాజు బాటిల్ పేలి పోయింది. దీంతో రజిని కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాజు ముక్కలు పొట్టలో గుచ్చుకొని తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు కాళ్లు, చేతులు పొట్ట పై యాసిడ్ పడడంతో కాలి పోయాయి. దీంతో అతన్ని ట్యూటికొరిన్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కానీ అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు చొరవ తీసుకుని అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
అదైర్యపడద్దు అండగా ఉంటా..
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ప్రమాదవశాత్తు తమిళనాడులో గాయపడిన కందికొండ రజిని కుమార్ ఘటనపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఫోన్ ద్వారా బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించారు. నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. తమిళనాడులోని ట్యూటికొరిన్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో పాటు రజనీ కుమార్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి రజనీ కుమార్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు విమానం ద్వారా హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని, అవసరమైతే ఎల్వోసీ ను మంజూరు చేయిస్తామని కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు తాను అండగా ఉంటానని అతని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పెద్ది కి రజనీ కుమార్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Recent Comments