అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
భార్యే హత్య చేయించిందని స్థానికులు, బంధువుల అనుమానం
రామన్నగూడెం తండాలో విషాదం
విచారణ చేపట్టిన డీఎస్పీ సదయ్య
స్పాట్ వాయిస్, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రామన్నగూడెం తండాలో గుగులోత్ రాంజీ (38 ) దారుణ హత్యకు గురయ్యాడు.. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుగులోత్ రాంజీ(38) రోజులాగే నిద్రించడానికి బిల్డింగ్ పైకి వెళ్లాడు. ఈ క్రమంలో రాంజీకి భార్య శాంతి మద్యం తెచ్చి ఇవ్వగా, తాగి నిద్రపోయాడు. అయితే తెల్లవారినా కూడా రాంజీ నిద్ర లేవకపోవడంతో తల్లి దస్లీ వెళ్లి చూడగా హత్యకు గురై ఉండడాన్ని గమనించింది. వెంటనే చుట్టుపక్కల వారికి, స్థానిక సర్పంచ్ బానోత్ సుగుణ కిషన్ నాయక్ కు సమాచారం ఇచ్చింది. వారు కొత్తగూడ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఎస్సై నగేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లా డీఎస్పీ సదయ్య, గూడూరు సీఐ యాసిన్ అలీ సంఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన ప్రదేశాన్ని తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి లోక్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, భార్య పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
నచ్చజెప్పిన నెలలోపే..
గత నాలుగేళ్లుగా రాంజీ తన కుటుంబంతో కలిసి హన్మకొండ రెడ్డి నగర్ లో నివాసముంటూ సుతారి పనికి వెళ్లేవారు. ఈ క్రమంలో వారికి కొత్త పరిచయాలు ఏర్పడడంతో సాఫీగా సాగుతున్న సంసారంలో సమస్యలు మొదలయ్యాయి. దీంతో భార్యాభర్తలు తరచూ గొడవలు పడేవారు. అవి ముదరడంతో భార్య శాంతి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో పెద్ద మనుషులు ఇరువురికి నచ్చజెప్పారు. ఇక నుంచి సొంత గ్రామంలో ఉంటూ ఏదైనా పని చేసుకుని జీవించాలని చెప్పారు. దీంతో మకాం హన్మకొండ నుంచి రామన్న గూడెంకు మర్చారు. పంచాయితీ జరిగి నెల రోజుల్లోనే రాంజీ హత్యకు గురయ్యాడని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు.
పథకం ప్రకారమే..
రాంజీ హత్య పథకం ప్రకారమే జరిగిందని స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాతంలో ఇద్దరు వ్యక్తులు టూ వీలర్లు వేసుకుని రాంజీ ఇంటి పక్కనే నిలబడి వున్నారు. ప్లాన్ ప్రకారమే రాంజీతో మంచిగా ఉన్నట్లు నటించిన భార్య శాంతి భర్తకు మద్యం తాగించి మత్తులోకి వెళ్లేలా చేసింది. వెంటనే ఇద్దరు వ్యక్తులు బిల్డింగ్ పైకి వెళ్లారని, ఒకరు కాళ్లు, చేతులు అదిమిపట్టుకోగా, ఇంకొకరు మెడకు వైరుతో ఉరివేసి చంపేశారని, ఈ హత్యలో భార్య ప్రమేయం ఉందని బంధువులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు వున్నారు.
దర్యాప్తు చేస్తున్నాం..
హత్య విషయమై స్థానిక ఎస్సై సీహెచ్ నగేష్ ని వివరణ కోరగా మృతికి సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని, గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం కోసం ఆరా తీస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా హాస్పిటల్ కు తరలించామన్నారు. పోస్ట్ మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని, దోషులు ఎవరైనా శిక్ష తప్పదని అన్నారు.
Recent Comments