Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఎంపీపీ, సర్పంచ్ ను చితకబాదారు..

ఎంపీపీ, సర్పంచ్ ను చితకబాదారు..

మొగుళ్లపల్లి మండలంలో ఘటన..
గ్రామ పంచాయతీ కార్యదర్శి మరణానికి కారణం మీరేనంటూ ఎంపీపీ, సర్పంచ్ పై దాడి
గాయపడిన ఎంపీపీని పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర..
దాడి హేయనీయమంటూ మండిపాటు
స్పాట్ వాయిస్, టేకుమట్ల: పంచాయతీ కార్యదర్శి మృతి మీరే కారణమంటూ టేకుమట్ల ఎంపీపీ మల్లారెడ్డి, సర్పంచ్ సరోత్తంరెడ్డిను చితకబాదారు. వివరాల్లోకి వెళ్తే.. టేకుమట్లలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేసే మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి అధికారులు, ప్రజా సంఘాలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు టార్గెట్ చేసి అతడిపై కక్షసాధింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో రాజేందర్ రెడ్డి బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతిచెందగా.. శుక్రవారం బంధువులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో.. టేకుమట్ల ఎంపీపీ మల్లారెడ్డి, సర్పంచ్ సరోత్తంరెడ్డి అక్కడికి రావడంతో ఆగ్రహానికి గురైన బంధువులు వారిపై దాడికి దిగి తరమికొట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న చిట్యాల సీఐ వేణుచందర్ చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి ఎస్సైలు శ్రీధర్, రమేశ్, సుధాకర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఎంపీపీని పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర
గ్రామ పంచాయతీ కార్యదర్శి అత్యక్రియల్లో పాల్గొన్న టేకుమట్ల ఎంపీపీ రెడ్డి మల్లా రెడ్డిపై దాడిజరగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హుటాహుటిన చిట్యాలకు చేరుకున్నారు. గాయపడిన ఎంపీపీని ఎమ్మెల్యే దగ్గరుండి చిట్యాల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హన్మకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన పై స్పందించిన ఎమ్మెల్యే పంచాయతీ సెక్రెటరీ ఆత్మహత్య చేసుకున్న నాటి నుండి అతని కుటుంబ సభ్యులకు తోడుగా ఆసుపత్రిలోనే ఉండి, అతను మరణించిన తరువాత దగ్గరుండి అన్ని చూసుకొని కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ప్రజా ప్రతినిధులపై దాడికి దిగడం హేయమైన చర్య అని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

అధికారులను వేధిస్తున్నారా..?
మండల కేంద్రానికి చెందిన కొంతమంది వ్యక్తులు జట్టుగా ఏర్పడి అధికారులను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు అంతేకాకుండా డబ్బులు సైతం డిమాండ్ చేస్తూ లీడర్లుగా చలామణి అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ పేరుతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లు రాస్తామని 200 నుంచి మొదలుకొని వేయి రూపాయల వరకు కంప్లైంట్లకు తీసుకుంటూ పంచాయతీ సెటిల్మెంట్లకు 5000 నుంచి పైకి తీసుకుంటూ బ్రోకర్ దందాలు చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేందుకు అధికారులను టార్గెట్ చేసుకొని పనులు చేసుకుంటున్నారని,వారికి ఎదురు చెబితే వారిపై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని మండిపడుతున్నారు. మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శుల విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శి రాజేందర్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేయడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే గుసగుసులు వినిపిస్తున్నాయి. మండలంలో ఇలాంటి వారి అరాచకాలకు చెక్ పెట్టేలా చూడాలని బీజేవైఎం మండల అధ్యక్షుడు కోలగూరి రమేశ్ అధికారులను కోరాడు.
 

RELATED ARTICLES

Most Popular

Recent Comments