ఎమ్మెల్యే వనమాపై అనర్హత..
ఆయన గెలుపు చెల్లదు..
హైకోర్టు సంచలన తీర్పు..
కాకరేపుతున్న ఖమ్మం రాజకీయం
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిణామాలు కాకరేపుతున్నాయి. తాజాగా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని సంచలన తీర్పునిచ్చింది. కొత్తగూడెంలో 2018లో వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ 2019లో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారని.. అందుకే వనమా ఎన్నికను రద్దు చేసి తనను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వేసిన ఎన్నికల పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ఉన్నత న్యాయస్థానం.. వనమా వెంకటేశ్వర్రావు 2018 ఎన్నికల అఫిడవిట్‌లో అవినీతికి పాల్పడినట్టుగా గుర్తించింది. ఎన్నికను రద్దు చేసి జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే వనమాకు రూ.5 లక్షల జరిమానా విధించింది.
Recent Comments