రాజేశ్వర్ రెడ్డి భార్యతోపాటు మరో వ్యక్తిపైనా..
ఫేక్ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జాకు యత్నించారు
ప్రశ్నిస్తే దూషిస్తూ బెదిరించారు
పోచారం పీఎస్ లో బాధితురాలి ఫిర్యాదు
ఎఫ్ఎఆర్ నమోదు చేసిన పోలీసులు
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పీఎస్ లో వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ ను ఆక్రమించే ప్రయత్నం చేశారని, ప్రశ్నించినందుకు బెదిరించారని బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పల్లా రాజేశ్వర్ రెడ్డితోపాటు ఆయన భార్య నీలిమ, మరో వ్యక్తి మధుకర్ రెడ్డిపై కేసు నమోదైంది. కాగా జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపైనా గతంలో పెద్దఎత్తున భూకబ్జా ఆరోపణలు రాగా ప్రస్తుతం పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో..
ఘట్ కేసర్ సమీప చౌదరిగూడ గ్రామంలో సర్వే నెం. 796లోని 150 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న తన ప్లాట్ (నెం. 18)ను అక్రమంగా స్వాధీనం చేసుకోడానికి యత్నించారని ఉప్పల్ సమీపంలోని బుద్ధనగర్ కు చెందిన ముచ్చెర్ల రాధిక ఈ నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య నీలిమ, మధుకర్ రెడ్డి తన ప్లాట్ లోకి చొరబడ్డారని పేర్కొన్నారు. ఈ విషయమై తన భర్త సిద్దేశ్వర్ ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని ఆమె తెలిపారు. మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో డూప్లికేట్ డాక్యుమెంట్లు సృష్టించి లేఔట్ వివరాలను మార్చేశారని రాధిఖ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పల్లాపై కేసు నమోదైంది
Recent Comments