మగాడైతే ధాన్యం కొనిపించాలి
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఒంట్లో నెత్తురుంటే, మగాడైతే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి శనివారం మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌లో వరి ధాన్యం, గోధుమలను సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ నుంచి వానాకాలం, యాసంగి ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యవహారం, తెలంగాణ ప్రజలను అవమానించిన తీరు ఇబ్బందిగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మీ ధాన్యం మీరే కొనండి.. మీ నూకల బియ్యాన్ని మీ ప్రజలకు మీరు అలవాటు చేయండి.. మేము పీడీఎస్ బియ్యం ఆపేస్తాం.. మీరు నూకలను పీడీఎస్ కింద ఇవ్వండని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వరి వేస్తే కేంద్రంతో కొనిపిస్తానని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్‌ను పట్టించుకోవద్దని బండి అన్నారు. ఇప్పుడేమో రాష్ట్రం సహకరించట్లేదని అంటున్నారంటూ మండిపడ్డారు. బండి సంజయ్ అసలు మనిషేనా..? బీజేపీ అధ్యక్షుడేనా? అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు
Recent Comments