Friday, November 15, 2024

బూమరాంగ్..

అయ్యో కొండా సురేఖ..
మంత్రి మాటలు.. తిరిగి ఆమెకు తగిలాయా..?
నిన్నటి వరకు సింపథి.. ఇయ్యాల విమర్శలు..

స్పాట్ వాయిస్, బ్యూరో: మెదక్ పర్యటనలో జరిగిన ఘటన.. సోషల్ మీడియాలో పోస్ట్.. మంత్రి కొండా సరేఖ కన్నీరు.. నిన్నటి వరకు మంత్రికి ఫుల్ మైలేజ్ ఇచ్చాయి. ఆమె కోసం మహిళా లోకం.., కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ భవన్ వరకు వెళ్లి బీఆర్ఎస్ శ్రేణులతో కుస్తీకి దిగేశారు. మంత్రిపై సోషల్ మీడియాలో ఆకతాయిలు చేసిన పోస్టుకు రాష్ట్రమంతా ఫుల్ సపోర్ట్ వచ్చింది. అయితే మంత్రి ఆ హైప్ ను కొనసాగించాలనుకున్నారో.. లేక.. పీక్ లోకి హైప్ ను తీసుకెళ్లాలనుకున్నారో కానీ,.. రెండో రోజు బుధవారం సైతం తన మాటలకు పదును పెట్టారు. ఎప్పుడు మంత్రి కొండా మాటలంటే హాట్ టాపికే. అదే రేంజ్ లోనే బుధవారం గాంధీ జయంతి సందర్భంగా కొండా సురేఖ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.

సినీ ఇండస్ట్రీ రివర్స్
కేటీఆర్​పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్​అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. సమంత-నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ ఇబ్బందులకు గురిచేశారన్నారు. హీరోయిన్స్ తొందరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమాలు విడిచి వెళ్లిపోవడానికి కేటీఆర్ కారణమని ఆరోపించారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారిని కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు పెట్టారని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ మాదిరిగానే అందరూ ఉంటారని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీమ్​కు చెప్పినట్లు ఉన్నారన్నారు. ఎస్టీ మహిళ మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, ఇప్పుడు బీసీ మహిళనైన తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడం బాధాకరం అన్నారు. సైబర్ క్రైమ్​లో ఫిర్యాదు చేశామని, పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెడతామని అన్నారు.

కొండా మాటలపై సమంతా ఫైర్..
తమ విడాకుల పట్ల రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి సమంత ఘాటుగా స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమని, వాటి గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని కోరారు. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం కావాలన్నారు. తన ప్రయాణానికి గర్వపడుతున్నానని, దాన్ని చిన్నచూపు చూడవద్దని సమంత పేర్కొన్నారు. మంత్రిగా మాట్లాడే వ్యాఖ్యలకు తీవ్రత ఉంటుందన్న విషయం అర్థం చేసుకొని ఉంటారని ఆశిస్తున్నట్లు సమంత వ్యాఖ్యానించారు.


నాగచైతన్య, అక్కినేని అమల
టాలీవుడ్​నటుడు అక్కినేని నాగచైతన్య సైతం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ మేరకు తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్‌ పోస్ట్​ను రీట్వీట్‌ చేశారు. మరోవైపు నాగార్జున సతీమణి అక్కినేని అమల సైతం ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు. తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ వివాదాల్లోకి తమను లాగవద్దని, ఓ మహిళా మంత్రి నిరాధార ఆరోపణలు చేయటం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందని విచారం వ్యక్తం చేశారు. మంత్రి సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్​గాంధీ చొరవ తీసుకోవాలని ఆమె ట్వీట్​లో పేర్కొంది.

ఖండిస్తున్నా..
సినీ నటుడు నాగార్జున ట్వీట్​
‘‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖగారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’


లీగల్ నోటీసులు..
మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై కొండా సురేఖ చేసిన ఆరోపణలను ఖండించిన ఆయన, తన గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న లక్ష్యంతోనే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకుంటున్నారని అన్నారు. ఒక మహిళ అయి ఉండి మరో మహిళ పేరుతో పాటు సినిమా నటుల పేర్లను వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. గతంలోనూ ఆమె ఇలా మాట్లాడినందుకే ఏప్రిల్‌లో నోటీసులు పంపించానన్నారు. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే చట్టప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడ్తానని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments