మహిళా రైతుతో మంత్రి ఎర్రబెల్లి ముచ్చట..
దేవరుప్పులలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..
సమస్యలపై రైతులతో ఆరా..
వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు..
స్పాట్ వాయిస్, జనగామ: ‘‘ఓ అవ్వా.. బువ్వ మొత్తం నువ్వే తిన్నవా.., నాకేం ఉంచలేదా.., మస్తు ఆకలైతాంది.., సద్దంతా నువ్వే తింటే నాకెట్ల అనుకున్నవ్…’’ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళా రైతుతో ముచ్చటించారు. దేవరుప్పుల మండలం చిన్నగూడూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నది..? మీకేమైనా సమస్యలున్నాయా..? అని ఆరా తీశారు. ఈ సందర్భంలోనే మంత్రి ఓ మహిళా రైతు సద్ది మూటను తెరిచి చూశారు. సద్దంతా నువ్వే తింటే నేనేం తినాలనుకున్నవ్ అవ్వా.. అని పలకరించాడు. దీంతో అక్కడి రైతులంతా ఆనందం వ్యక్తం చేశారు. తమ నాయకడు, మంత్రిగా ఉన్నా, మామూలుగా ఉన్నా ఎప్పుడూ ఒకే తీరైన నడవడికతో ఉండడం, ఆ స్థాయి వ్యక్తి తమతో ఇంత చనువుగా మాట్లాడడంతో వాళ్లంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. కాగా, ఈ సందర్భంగా రైతులు మంత్రికి ధాన్యం రవాణా సమస్యను వివరించారు. వెంటనే మంత్రి సంబంధిత అధికారులు, కలెక్టర్ తో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లడానికి లారీలు రావడం లేదని అక్కడి రైతులు చెబుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. అక్కడే ఉన్న అధికారితో మాట్లాడి కారణాలు తెలుసుకుని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తేవాలని రైతులకు మంత్రి సూచించారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన ఆఖరు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
Recent Comments