వేలల్లో నష్టపోతున్న అన్నదాత
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: రైతన్న తరుగు దోపిడీకి గురవుతున్నాడు. ఆరుగాలం శ్రమను కేంద్ర నిర్వాహకులు, మిల్లర్లు కొర్రీలు పెట్టి.. కడుపునింపుకుంటున్నారు. ప్రతీ సీజన్‌లో ఈ తంతు జరగడం.. అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పడం షరా మామూలైంది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి కొనుగోలు సెంటర్‌లో అన్నదాతలను నిండా ముంచిన ఘటన వెలుగు చూసింది. గత నెల 28న రైతులు రాములు, రాజు, యాల్రాది, భూక్యాశేఖర్, సుదర్శన్ రైతులు పీఏసీఎస్ కొత్తపల్లి కొనుగోలు సెంటర్ లో 661 బస్తాల ధాన్యం తూకం వేశారు. అనంతరం రెండు, మూడురోజల వ్యవధిలో కొత్తపల్లి గ్రామ శివారులోని శ్రీమాత రైస్ మిల్లుకు ధాన్యాన్ని లారీ ద్వారా తరలించారు. అక్కడికి చేరుకున్న ఈ రైతుల ధాన్యం తూకం, ముక్క తదితర పేర్లతో 17 బస్తాలు కోత పెట్టారు. కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసుకున్నది మీరే కదా రైతుల ప్రశ్నించారు. ఇప్పుడు ముక్కపేరుతో మిల్లు యజమాని తూకం తగ్గించారని తెలిపారు. దీంతో రైతులు తాము ఇచ్చినప్పుడు ధాన్యం మంచిగానే ఉన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లరు, కొనుగోలు కేంద్రం నిర్వహకుడు ఇద్దరు కలిసి మమ్ముల్ని మోసం చేశారని రైతులు మిల్లు ఎదుట ఆదివారం నిరసనకు దిగారు. మిల్లు యజమాని కర్ణాకర్ ను వివరణ కోరగా 17 బస్తాలు తూకం తేడా వస్తుందని తాను భావించలేదని తూకం ప్రకారం బిల్లు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఒక్కలారీ లోడులో 17 బస్తాలు ముక్క పేరుతో కోత పెట్టడం అన్యాయమని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
Recent Comments