*బతికున్నోళ్లను చంపుతుండ్రు..
*శవాలపైనా బేరసారాలు..
*మార్చురీలో ఫిక్స్ డ్ రేట్లతో సంబంధీకుల ఆందోళన..
*డెడ్ బాడీ అప్పగించే వరకు రూ.6 వేలపైగా ముట్టజెప్పాల్సిందే..
*కన్నీరుమున్నీరవుతున్న మృతుల బంధువులు..
స్పాట్ వాయిస్, ఎంజీఎం : కుటుంబంలో వ్యక్తి దూరమవడమే పెద్ద నరకం. ఆ వ్యక్తిని తలుచుకుంటూ వేదనను దిగమింగుకోవడం మహా కష్టం. అందునా సదరు వ్యక్తి డెడ్ బాడీ మార్చురీలో ఉండగా, సంబంధీకులంతా గది బయటే అతడినే గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకాలు నెమరేసుకుంటూ కార్చే కన్నీరు ఎంతకూ ఆగనిది. కుటుంబం నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని మర్చిపోవడానికి ఏమేం చేయాలి.., కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే హైరానాలోనే ఉన్న బంధువులు, కుటుంబసభ్యుల ఆవేదన చూస్తే మనస్సు తరుక్కుపోతుంది. ఆ హృదయవి దారకమైన దృశ్యాన్ని చూసి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం చేసి ఎప్పుడెప్పుడు అప్పగిస్తారా.. అని ఎదురుచూస్తూ పుట్టెడు దు:ఖంలో ఉన్న వారికి మార్చురీలో చోటు చేసుకునే ఘటనలు మరింత ఇబ్బందిగా మారితే అంతకన్నా దుస్థితి ఏముంటుంది. కంటికిమింటికి ఏడ్చే వారికి మరింత ఖర్చు తప్పదని తెలిసి ఏమైపోవాల్సి ఉంటుంది.
**బతికున్నోళ్లను చంపుడే..
చనిపోయిన వ్యక్తి సంబంధీకులు ఎంజీఎం మార్చురీకి వెళ్లారంటే వాళ్లూ చావాల్సిన పరిస్థితే. డెడ్ బాడీని తీసుకెళ్లి మార్చురీ గదిలో వేసిన నుంచి ఖండఖండాలుగా కోసి కుట్లేసి అప్పగించే వరకు ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించిన తీరుతో అయినవాళ్లంతా ఖంగుతినాల్సిందే. శవాన్ని పోస్టుమార్టానికి తీసుకెళ్లడానికి ముందే డాక్టర్లు మొదలు సహాయకులు, నిర్వాహకులంతా చనిపోయిన వ్యక్తి తాలూకు వారికి చెల్లించాల్సిన డబ్బుల విషయంలో హుకుం జారీ చేస్తున్న తీరు బాధాకరం. ఒక్కమాటలో చెప్పాలంటే చచ్చిన వ్యక్తి బాగానే ఉంటాడు గానీ, వరంగల్ ఎంజీఎం మార్చురీలో జరిగే తంతును చూసి బతికున్న వారు కూడా చస్తే బాగుండురా.. అనే ఫీలింగ్ కలుగుతుందంటే అతిశయోక్తి కాదు.
**శవాలపైనా బేరసారాలు..
శవాల గదిలో కూడా సీరియల్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. వరుసగా సెలవులు రావడం, లేదంటే డ్యూటీ డాక్టర్లు సెలవుల్లో వెళ్లడం, అదీ కాదంటే మరేదైనా ఇతరత్రా కారణాలతో పోస్టుమార్టం చేయాల్సిన శవాలు అప్పుడప్పుడు పేరుకుపోతాయి. అలాంటి సమయంలో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు, ఆడ దిక్కుతప్ప వేరేవరు లేని వారి తాపత్రయాన్ని కూడా క్యాష్ చేసుకోవడంలో వెనకాడడం లేదంటే అంతకన్న దుస్థితి ఏమీ ఉండదేమో. కొద్ది సందర్భాల్లో కాస్త ఎక్కువ సమర్పించుకునే వారు ఉంటే ఆ వ్యక్తి సంబంధీకులకు కొంత త్వరగా డెడ్ బాడీ అప్పగింత జరగడం, చేతిలో సరిపడా డబ్బులు లేక కొసరి కొసరి ఇచ్చే వారికి గంటల కొద్దీ నిరీక్షణ తప్పని దౌర్భాగ్యం. అలాంటి సమయంలో ఇంటాయన పోయి ఎప్పుడెప్పుడు డెడ్ బాడీని అప్పగిస్తారా.., చూసుకుని కళ్లారా ఏడ్చి కాస్త కుదుటపడడానికి ఆతృతగా ఉండే వారి దయనీయతను ప్రత్యక్షంగా చూసిన వారికే తెలియాలి గానీ, ఎంత చెప్పినా అర్థం కాని ఆవేదన అది.
** ఫిక్స్ డ్ రేట్లు..
మనిషి పోయిన బాధలో ఉన్న బంధువులకు మార్చురీలోని ఫిక్స్ డ్ రేట్ల వ్యవహారం మరింత కుంగిపోయేలా చేస్తోంది. పోస్టు మార్టం చేసే డాక్టర్ నుంచి మృతదేహాన్ని చాపలో చుట్టుకొచ్చి అప్పగించే వరకు ప్రతి పనికో రేటు నిర్ణయించారు. అధికారికంగా ఎవరూ ఎక్కడా ఈ విషయమై మాట్లాడకున్నా, అంతర్గతంగా ఈ విషయం అందరికీ తెలిసిందే. డెడ్ బాడీని పోస్టుమార్టం చేయడానికి తీసుకెళ్లడానికి డాక్టర్ సంతకం చేయాలంటే రూ.2000, ఫొటో గ్రాఫర్ కు రూ.1500, పోస్టుమార్టం చేసే సిబ్బందికి రూ.2 వేలు, అన్నీ తంతులు పూర్తి చేసిన తర్వాత చాపలో చుట్టి బయటకు తీసుకొచ్చి వ్యాన్ లో వేసే వారికి రూ.వెయ్యి అక్షరాల సమర్పించుకోవాల్సిందే. ఇక్కడ ఆయా సిబ్బందికి శక్తి మేరకు ఇచ్చుకోవాల్సిందే, కాకపోతే అప్పుడప్పుడు మృతుడి బంధువుల ఆర్థిక స్థితిని బట్టి కాస్తోకూస్తో కొంత మినహాయింపు ఉంటుంది. ఎంత కాదన్నా ఒక డెడ్ బాడీని పోస్టుమార్టం తంతు పూర్తి చేసుకుని బంధువులకు అప్పగించే వరకు రూ.6 వేలకు పైగానే ముట్టచెప్పుకోవాల్సిన దుస్థితి. ఇందులో కొసమెరుపు ఏంటంటే సందర్భాన్ని బట్టి కూడా పోలీసులకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇస్తేనే తంతు సజావుగా, వేగంగా జరుగుతుందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో గమనించవచ్చు.
***మేమెందుకు బతికామురా దేవుడా..
కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రుల ఆవేదన..
పరకాల సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడికి అప్పటికే వివాహమై భార్య తోపాటు నెలల పాప ఉంది. రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. అయినా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కుమారుడిని చదివించి ప్రయోజకుడిని చేశారు. కానీ, రోడ్డు ప్రమాదం రూపంలో కుమారుడు అర్థంతరంగా అశువులు బాయడంపై తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందారు. ఉద్యోగంలో చేరిన కొడుకుతో తమ శేషజీవితం ప్రశాంతంగా గడపొచ్చు అనుకున్న వారికి అతడి మరణ వార్త తీవ్రంగా కృంగదీసింది. తమ బతుకంతా కొడుకు, కోడలు, మనవరాలిపైనే పెట్టుకుని బతుకుతున్న వృద్ధ దంపతులకు ఈ ఘటనతో గుండెల్లో పిడుగుపడినట్టు అయ్యింది. ఎదిగిన కొడుకు పోయాడనే బాధను దిగమింగుకోవడమే కష్టమైన పరిస్థితి ఓ వైపు వేధిస్తుండగా, కుమారుడికి పుట్టిన ఆడ పిల్ల పరిస్థితి, కుమారున్నే నమ్ముకుని వచ్చిన భార్య పరిస్థితి ఏంటనే దిగులుతో వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అదే సమయంలో యువకుడి డెడ్ బాడీ ఎంజీఎం మార్చురీలో తంతు పూర్తి చేసుకోవడానికి కావాల్సిన డబ్బులు కూడా ఇచ్చుకోలేని దుస్థితి. నెలల వయస్సున్న మనవరాలినే చూస్తూ పుట్టెడు ఏడుపులో వాళ్లు ఉండగా, ప్రతి కార్యానికి ఓ రేట్ చొప్పున ప్రతి సందర్భంలో వారిని పిలుస్తూ విసిగించడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన వారికే తెలుస్తుంది. ఆ బాధ ఆ తల్లిదండ్రులకు ఎంతటి గుండె కోతను మిగులుస్తుందో అనుభవించిన వారికే అర్థమవుతుంది. గంటల తరబడి ఏడ్చేడ్చి స్పృహతప్పి పడిపోతే కనీసంగా నీళ్లు తాగడానికి కూడా ఓపిక లేని వారి పరిస్థితిని కూడా పట్టించుకోకుండా శవాలపై ఏదో ఏరుకునే వారిలా వ్యవహరించిన వారి తీరును చూస్తే సభ్యసమాజం ఎటు పోతుందో అనే ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు. ఇది ఆ ఒక్కరి తల్లిదండ్రుల బాధే కాదు, ఇలాంటివి వరంగల్ ఎంజీఎంలో కోకొల్లలు. ఇంత జరుగుతున్నా యంత్రాంగం, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారో మాత్రం ఎవరికీ అంతుచిక్కని విషయమే.
Recent Comments