ఎమర్జెన్సీ వార్డు డస్ట్ బిన్లో మూత్రం పోసిన సిబ్బంది
ఫుల్ గా తాగి.. ఆగమాగం..
మానుకోట ఆస్పత్రిలో దారుణం..
దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామన్న సూపరింటెండెంట్
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫుల్లుగా తాగి ఎమర్జెన్సీ వార్డులో రోగుల ఎదుట అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భరత్, కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు ఓ ఏజెన్సీ ద్వారా మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో నియామకం అయ్యారు. శుక్రవారం రాత్రి వీరిద్దరూ పేషెంట్ల ముందే ఫుల్‌గా తాగి అసభ్యంగా ప్రవర్తించారు. ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్లకు వైద్యం అందిస్తున్న చోట.. అందరూ చూస్తుండగానే డస్ట్ బిన్లో మూత్రం పోశారు. అంతటితో ఆగకుండా ఇదేమిటని ప్రశ్నించినవారిపై దౌర్జన్యానికి దిగారు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరంటూ చిందులు తొక్కారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుతో పాటు మిగతా వార్డుల్లోని రోగులు కూడా భయపడిపోయారు. ప్రమాదంలో గాయపడినవారికి కట్లు కడుతూ ఇలా నిర్లక్ష్యంగా, అసభ్యంగా ప్రవర్తించడంపై పేషంట్లు, వారి తరుఫు బంధువులు మండిపడుతున్నారు. వీళ్ల ప్రవర్తనపై అనేకసార్లు ఫిర్యాదు చేసినా.. ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఘటనపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్.. వైరల్ అవుతున్న వీడియోలోని వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. నిజంగా ఆ ఘటన ఆసుపత్రిలోనే జరిగిందా? లేదా అనేది విచారణలో తేలుతుందని అన్నారు. ఆసుపత్రిలోనే జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Recent Comments