కొడుకు కోసం ప్రాణం వదలిన తల్లి
కన్నపేగు పై దుండగుల దాడి..
అడ్డుకున్న తల్లి
గొడ్డలితో నరికిన నిందితులు
అక్కడికక్కడే తల్లి మృతి.. నిలిచిన కొడుకు ప్రాణం
మాహబూబాబాద్ జిల్లాలో విషాదం
స్పాట్ వాయిస్, కేసముద్రం: కొడుకును రక్షించుకొనేందుకు వెళ్లిన తల్లిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన గురువారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలో చోటు చేసుకుంది. కేసముద్రం ఎస్సై రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటగిరి గ్రామానికి చెందిన కత్రి చందుసింగ్-అమృత(48) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ఉపేందర్ అతడి భార్య మధ్య కొన్నిరోజులుగా కొనసాగుతున్న వివాదం విషయమై గురువారం ఉదయం అమృత తన ఇద్దరు కుమారులతో కలిసి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన కౌన్సెలింగ్ కు వెళ్లారు. సాయంత్రం అమృత, ఉపేందర్ ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఆటో ముందు ద్విచక్రవాహనంపై చిన్న కుమారుడు సురేందర్ వస్తుండగా వెంకటగిరి గ్రామ శివారు మూలమలు వద్ద అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ద్విచక్రవాహనాన్ని అడ్డుకొని సురేందర్ పై గొడ్డలితో దాడికి యత్నించారు. ఆటోలో ఉన్న తల్లి దాడి జరుగుతుందన్న విషయాన్ని గమనించి ఆటోలోంచి కిందకు దూకి దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో సురేందర్ వీపుపై గాయమైంది. వారి నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకునేందుకు సురేందర్, అతని తల్లి అమృత గ్రామం వైపు పరుగులు తీశారు. వారిని వెంబడించిన నలుగురు వ్యక్తులు అమృతను వెనుక నుంచి నడిరోడ్డుపై గొడ్డలితో దారుణంగా నరికారు.
తీవ్రంగా గాయపడిన అమృత అక్కడే మృతి చెందారు. దాడి జరుగుతున్న సమయంలో ఉపేందర్ ప్రాణభయంతో పారిపోయారు. తనయుడిని కాపాడుకునేందుకు అమృత నిందితులను అడ్డుకోవడంతో కుమారుడికి ప్రాణాపాయం తప్పగా ఆమె మృత్యువు ఒడికి చేరింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు పాల్పడింది అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులుగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. నలుగురితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది.
Recent Comments