Friday, November 15, 2024
Homeటాప్ స్టోరీస్బుల్డోజర్ల పాలన నడిపిస్తున్నారు

బుల్డోజర్ల పాలన నడిపిస్తున్నారు

బుల్డోజర్ల పాలన నడిపిస్తున్నారు
చూస్తూ.. ఊరుకోం..
ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచిపోయారు
మావోయిస్టు పార్టీ లేఖ
సీఎం రేవంత్, ప్రభుత్వానికి వార్నింగ్
స్పాట్ వాయిస్, బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి మావోయిస్టులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లగచర్ల ఘటనతోపాటు హైడ్రా తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఆపాలని హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో గురువారం రిలీజైన లేఖ సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడిచిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పని చేస్తుందన్నారు. పౌర ప్రాధమిక హక్కులను, జీవించే హక్కును కాలరాస్తుందని, రాష్ట్రాన్ని కార్పోరేట్లకు కట్టపెట్టడానికి ఆర్ధిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పోరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారన్నారు. హైదరాబాద్ ను ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) చేయడానికే ప్రపంచ స్థాయి హైదరాబాద్ (గ్లోబల్ హైదరాబాద్) నిర్మించే పేరుతో మూసీ నది సుందరీకరణ, రివర్ బెడ్ ప్రక్షాళన, హైదరాబాద్ లో అక్రమ కట్టడాల పేర్లతో రివర్ బెల్ట్ డెవలప్ మెంట్సే కార్పోరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డిసిఎల్), కార్యచరణ విభాగం హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ప్రత్యేక విభాగాలను ఏర్పరచి వాటికి విస్తృత అధికారాలను కట్టబెట్టి బుల్డోజర్ల పాలస కొనసాగిస్తున్నారని మావోయిస్టు పార్టీ మండిపడింది.
అధికార మదంతో దౌర్జన్యం..
మూసీ నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చారిత్రక కట్టడాలను నిర్మించడానికి దేశ, విదేశీ కార్పొరేట్ల వేల కోట్ల పెట్టుబడులను రేవంత్ ఆహ్వానించాడని, మూసీ నది ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు స్వేచ్ఛమైన తాగునీరు అందించడానికి పరిశుభ్రత చర్యలు చేపట్టడం లేదని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ రాసిన లేఖలో ప్రస్తావించారు. పరిశ్రమల నుండి, నగరం నుండి వెలుపడుతున్న వ్యర్థాలు, అనేక వ్యర్థ పదార్థాల నుండి ఏర్పడుతున్న కాలుష్యం, మురికి నీరు మూసీ నదిలో చేరుతున్నాయని, వాటి నివారణ చర్యలు, నీటి శుద్ధి చేయకుండా వీటిన్నింటికి కారణం కేవలం మూసి పరివాహాక ప్రాంత ప్రజలను బాధితులను చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల పేరుతో అక్రమంగా నిర్మించిన ఐడా, బడా వ్యక్తుల, సంస్థల పెద్ద, పెద్ద అంతస్తులను వదిలేసి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులతో నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం వుంటున్న మద్య తరగతి, పేద ప్రజలను అక్రమదారులుగా ప్రకటించారని ఆరోపించారు. న్యాయ పరమైన అనుమతులు పక్కన పెట్టి, ప్రజలకు ఎలాంటి ముందుస్తు సమాచారం గాని, నోటీస్ లు గాని ఇవ్వకుండా అధికార మదంతో దౌర్జన్యంతో, ఆకస్మికంగా రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లతో కష్టజీవులు నిర్మించుకున్న నివాసాలను కూల్చేసి సాధారణ ప్రజలు జీవించే హక్కును హరించి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజర్వు ఫారెస్టును ఎందుకు ధ్వంసం చేస్తున్నారు
వికరాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండంలో విఎల్ఎఫ్ (వెరీ లో ప్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్(నేవీ రాడార్) స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కల్పించిందని లేఖలో వివరించారు. దామగుండంలో నేవి రాడర్ స్టేషన్ నిర్మాణం కోసం రిజర్వ ఫారెస్టు 2900 ఎకరాల భూమిని అప్పగించారని, దీనితో సహజ సిద్ధమైన అనంతగిరికొండలున్న రిజర్వు ఫారెస్టు ద్వంసం అవుతుందన్నారు. అడవిపై ఆధారపడి జీవినం సాగిస్తున్న వేలాది మంది జీవించే హక్కును కోల్పోతున్నారని, కొడంగల్ నియోజవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో పార్మసిటిని నిర్మించి ప్రాకృతిక వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారని మండిపడ్డారు. భూములు కొల్పుతున్న రైతులు జీవన, మరణ పోరాటంలో లగచర్ల గ్రామ ప్రజలు మిలిటెంట్ ఉద్యమం చేపట్టారని, ప్రజలు న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు పెట్టి బనాయించారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫాసిస్టు దాడులు..
అదిలాబాద్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పట్టారని, ప్రజోద్యమాన్ని అణిచివేయడానికి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉపాధ్యాయున్ని విధుల నుండి సస్పెండ్ చేశారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణీయ హిందుత్వ కేంద్ర ప్రభుత్వం అంటకాగుతూ మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంలో విప్లవ కారులపై ఫాసిస్టు దాడులకు పూనుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం దామెరతోగు గ్రామాల వద్ద వందలాది బలగాలను మోహరించి కా.నల్లమారి అశోక్ ను, ఇదే జిల్లాలో కరకగూడెం మండలం రఘునాధపాలెం గ్రామం వద్ద ఆరుగురి విప్లవకారులను పాశవికంగా హత్యలు చేశారని ఆరోపించారు.
అంతా కార్పొరేట్ల లాభాల కోసమే..
రాష్ట్రంలో జరుగుతున్న విద్వంసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనో, బాధ్యత రాహిత్యం వల్లనో జరుగుతున్నది కాదని, ఉద్ద్యేశ పూర్వకంగా కార్పోరేట్ల లాభాల కోసం కొమ్ముకా స్తూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వారి నమ్మిన బంటునని నిరూపించుకోవడానికి అత్యుత్సాహం పదర్శిస్తున్నాడని మావోయిస్టు పార్టీ మండిపడింది. కార్పొరేట్ల పెట్టుబడులలో వాటా, పెద్ద మొత్తంలో కమీషన్లను సీఎం రేవంత్ రెడ్డి పొందుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పోరేట్ల అనుకూల, ప్రజావ్యతిరేక అప్రజాస్వామిక పాశవిక పాలనను ప్రతి ఒక్కరూ ఖండించాలని, అక్రమ కట్టడాలు, మూసినది ప్రక్షాళన పేర్లతో మద్యతరగతి, పేద ప్రజలపై హైడ్రా కొనసాగిస్తున్న అనాగరిక బుల్డోజర్ దాడులను వ్యతిరేకించాలని, పర్యావరణాన్ని విద్వంసం చేస్తున్న నేవి రాడర్ స్టేషన్ ను, పార్మాసిటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విరోచితంగా మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments