స్పాట్ వాయిస్ , మానుకోట: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. ఈ నిత్య పెళ్లి కూతురు ఒకరికి తెలియకుండా ఒకరిని ఇలా తొమ్మిది మందిని పెళ్లాడింది. తొమ్మిదో భర్తతో బెంగుళూర్లో కాపురం పెట్టింది. కొంతకాలం బాగానే గడించింది. కానీ అంతలోనే ఆ భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. చివరకు పోలీసుల చెంతకు చేరగా.. ఆమె పెళ్లి లీలలు బయట పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే..
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన స్వప్నకు కృష్ణా జిల్లా గంపలగూడెంకు చెందిన వెంకటేశ్‌తో ఓ మ్యాట్రిమోని వెబ్సైట్లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా పెళ్లికి దారి తీసింది. ఏప్రిల్ 10 , 2019న వీరి వివాహం జరిగింది. వెంకటేశ్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో దంపతులు బెంగుళూరులో కాపురం పెట్టారు. రెండు నెలలు బాగానే గడిచింది. స్వప్న తరచూ ఫోన్లో కోర్టు విషయాల గురించి మాట్లాడుతూ.. ఉండేది. ఏంటని అతను ప్రశ్నిస్తే గొడవకు దిగేది. ఇలా నడుస్తున్న క్రమంలో ఓ రోజు బెంగుళూరు నుంచి అకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్లింది. తిరిగి వచ్చాకా మరోసారి హైదరాబాద్ వెళ్తాననడంతో అసలు విషయమేంటనే కోణంలో వెంకటేశ్ కూపీ లాగాడు. దాంతో స్పప్న పెళ్లి లీలలు వెలుగు చూశాయి. ఆమె తన కంటే ముందు ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్న తతంగమంతా తెలుసుకున్నాడు. ఇలాంటి మహిళతో తానుండలేనని భావించి తనకు విడాకులు ఇవ్వాలని వెంకటేష్ స్వప్నను కోరాడు. దానికి ఆమె ససేమిరా అంది. విడాకులు ఇవ్వకుండా రివర్స్‌లో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో భర్తే తన కంటే ముందు అనేక పెళ్లిళ్లు చేసుకున్నాడని పేర్కొంది. ఆ వివాహాల గురించి అడిగితే తనపై చేసుకున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న వెంకటేశ్ సాక్ష్యాధారాలతో సహా పోలీసుల వద్దకు చేరుకున్నాడు. ఆమె వివాహమాడిన ఎనిమిది మంది వివరాలను పోలీసుల ముందుంచాడు. వారిలో కొంత మంది మరణించారని పోలీసులకు తెలిపాడు.ఇద్దరి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అసలు సంగతేంటో దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్ నిత్యపెళ్లికుమారుడా లేక స్వప్న నిత్య పెళ్లికుమార్తెనా..? ఎవరు ఎవర్ని మోసం చేశారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయింపు
అయితే భర్త తీరుపై నిరసన వ్యక్తం చేసిన స్వప్న పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించింది.
Recent Comments