వందల ఎకరాల్లో నేలకొరిగిన వరి, నెల రాలిన మామిడి.
విద్యుత్ సరఫరాలో అంతరాయం.
ఈదురు గాలులకు ఎగిరిపోయిన ఇళ్లపై రేకులు
స్పాట్ వాయిస్, మల్హర్: మండలంలో బుధవారం రాత్రి గాలి వాన భీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కురిసిన వర్షానికి వందల ఎకరాల్లో కోయడానికి సిద్ధంగా ఉన్న వరి నేలకొరిగింది. మండలంలోని పలు ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. మండలంలోని ఐకేపీ కేంద్రాలు గత వారం క్రితం ప్రారంభించినప్పటికీ ఒక్క చోట కూడా ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేకపోవడంతో వరి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రం తాడిచెర్లలో గాలి వానకి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. తాడిచెర్ల లోని ఇండియన్ గ్యాస్ కార్యాలయంతో సహా పలువురు ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. తాడిచెర్ల కి చెందిన మల్క మోహన్ రావు వ్యవసాయ భూమిలో పదుల సంఖ్యలో టేకు చెట్లు నేలకొరగగా, భారీ సంఖ్యలో పలువురు రైతుల మామిడి చెట్లు ధ్వంసం అయి మామిడి కాయలు పూర్తిగా రాలి పోయాయి. శ్రీ సాయి వాణి విద్యానికేతన్ పాఠశాల తరగతి గదుల రేకులు పూర్తి స్థాయిలో ధ్వంసం అయ్యాయని పాఠశాల కరస్పాండెంట్ సంపత్ రావు తెలిపారు. రానున్న రెండు, మూడు రోజులు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకొని త్వరిత గతిన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Recent Comments