ఎంజీఎంకు బాధితుల పరుగులు
స్పాట్ వాయిస్, రెడ్డికాలనీ: హన్మకొండలోని నాలుగు డివిజన్లలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. రెడ్డి కాలనీ, యాదవ్ నగర్, కృష్ణ కాలనీ, గౌతమ్ నగర్ లలో రెచ్చిపోయాయి. గురువారం ఒక్కరోజే కనిపించిన వారిని కనిపించినట్టు కరిచి హైరానా రేపాయి. నిమిషాల వ్యవధిలోనే సుమారు 15 మందిని కరువగా వెంటనే స్పందించి నాలుగో డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ డాగ్ స్క్వాడ్ మున్సిపల్ సిబ్బందితో పిచ్చికుక్కలను పట్టించారు. మొత్తంగా ఒక్కరోజే పై నాలుగు కాలనీల నుంచి 32 మంది ఎంజీఎంకు బాధితులు తరలివచ్చారు.
అయినా చలనం లేదా..?
ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలంలో జరిగిన ఘటన ప్రజలను మరింత భయానికి గురిచేసింది. బుధవారం రాత్రి హసన్ పర్తి మండలం కోమటిపల్లిలో అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. నమ్మిండ్ల అవిక (4) నుదురు, కంటి భాగాలను కరిచాయి. కుక్కల దాడిలో చిన్నారికి తీవ్రంగా రక్తం కారి, ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కుక్కల దాడిలో గాయపడిన చిన్నారిని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతోంది.
పట్టింపులేని అధికారులు..
కుక్కల బెడద విషయమై ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. కుక్కలను నివారించాలని, జీవాలకు టీకాలు వంటివి వేయించి తమకు భయాందోళనలు లేకుండా చేయాలని వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పైగా, ఎక్కడెక్కడో పట్టుకున్న కుక్కలను జనావాసాల్లో వదలడం, కుక్కలున్నాయని సమాచారం ఇచ్చినా అధికారులు పట్టింపులేకుండా వ్యవహరించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల నియంత్రణలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న సంబంధిత శాఖాధికారులపై కఠినంగా వ్యవహరిస్తేనే సమస్యకు పరిష్కారం వస్తుందని పలువురు బాధితులు ఎంజీఎం ఆవరణలో అసహనం ప్రదర్శించడం కనిపించింది.
Recent Comments