Monday, November 25, 2024
Homeటాప్ స్టోరీస్మూడు దశల్లో జీపీ ఎలక్షన్స్..

మూడు దశల్లో జీపీ ఎలక్షన్స్..

మూడు దశల్లో జీపీ ఎలక్షన్స్..

సెప్టెంబర్ 6న డ్రాఫ్ట్ నోటిఫికేషన్

21న ఫైనల్ ఓటర్ జాబితా.. 

నాలుగైదు నెలల్లో ప్రాసెస్ కంప్లీట్.. 

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి..

 

స్పాట్ వాయిస్, బ్యూరో : పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​పార్థసారథి అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లా, డివిజన్​ పంచాయతీ అధికారులు, ఈఆర్​ఓలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషన్​ పంపించిన అసెంబ్లీ ఓటరు జాబితాల ఆధారంగా పంచాయతీలు, వార్డుల వారీగా సిద్ధం చేయాలని తెలిపారు. సెప్టెంబరు 6 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాలు తయారు చేసి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సూచనలు స్వీకరించాలని తెలిపారు.

ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులన్నీ జాగ్రత్తగా సీఈసీ నిబంధనల మేరకు పూర్తి చేసి సెప్టెంబరు 21న తుది జాబితా ప్రచురించాలని పార్థసారథి ఆదేశించారు. ఓటరు జాబితా సిబ్బంది తర్వాత వార్డుల వారీగా పోలింగ్​ సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలుంటాయని వివరించారు. ఎన్నికల అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు తయారు చేసిన గ్రీవెన్స్​ మాడ్యూల్​ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారథి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సులో పంచాయతీ రాజ్​ కార్యదర్శి లోకేశ్​ కుమార్​, కమిషనర్​ అనిత రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

నాలుగైదు నెలల్లో ఎన్నికలు..!

నాలుగైదు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసేందుకు అందరూ సమాయత్తం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​పార్థసారథి అధికారులను ఆదేశించారు. మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనునున్నట్లు సమాచారం. ఆ తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు… చివరి దశలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించనున్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 600 ఓటర్లు… 650 దాటితే అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఎన్నికల కమిషన్ ప్రణాళికలు చేస్తోంది.

తప్పిదాలకు తావివ్వొద్దు..

ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. పార్టీలకు అతీతంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు సున్నితత్వంతో కూడుకొని ఉంటాయని, ఏమాత్రం అజాగ్రత్తకు తావివ్వకుండా, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. తుది ఓటరు జాబితాను వెలువరించడానికి ముందే క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఏవైనా మార్పులు, చేర్పులకు సంబంధించిన అభ్యర్థనలు వస్తే వాటిని పరిశీలించి ఓటరు జాబితాలో చేర్చే అధికారం కేవలం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేకుండా ప్రతీ దశలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యానికి తావివ్వకూడదని జాగ్రత్తలు సూచించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి గల్లంతు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రతిఒక్కరు తమతమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని, అలసత్వాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని సమకూర్చుకోవాలని, ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన పోలింగ్ సిబ్బందిని గుర్తించి, వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, ర్యాండమైజెషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలలో విధులను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంపీడీఓలు తమతమ మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి వాటి స్థితిగతులను పరిశీలించాలని ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments