లేగదూడకు బారసాల..
వైభవంగా నామకరణ, డోలారోహనోత్సవం
స్పాట్ వాయిస్, కాజీపేట : సాధారణంగా చిన్నారులకు 21 రోజు నామకరణం వేడుక చేసి పేరు పెట్టడం చూశాం.. కానీ ఓ లేగదూడకు కాజీపేటలో ఘనంగా బారసాల నిర్వహించి, దానికి ఐలమ్మగా నామకరణం చేశారు. ఒగ్గు పూజారులు సంప్రదాయ పద్ధతిలో స్థానిక కాలనీ వాసుల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి… కాజీపేట మండలం సోమిడి గ్రామంలో గొర్రెల, మేకల పెంపకందారుల సహకార సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ చైర్మన్ మేకల కేదారి యాదవ్ గృహంలో ఆదివారం గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒగ్గు వాయిద్యాల నడుమ ఒగ్గు పూజారులు సంప్రదాయ రీతితో గోమాతను, లేగ దూడకు నూతన వస్ర్తాలతో అలంకరించారు. అనంతరం లేగ దూడకు నామకరణం, డోలారోహన (తొట్టిలో వేయడం) ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లేగదూడకు “ఐలమ్మ” అని నామకరణం చేశారు. అనంతరం కేదారి యాదవ్ మాట్లాడుతూ సమస్త దేవతలు కొలువైవున్న గోమాతకు, హిందూ జీవన విధానానికి ప్రాచీన కాలం నుంచి అవినాభావ సంబంధం ఉందన్నారు. గో మూత్రంతో కాన్సర్, దయాబెటీస్ వంటి అనేక దీర్ఘ కాలిక రోగాలను నయం చేసే గొప్ప ఔషధ గుణాలున్నాయన్నారు. గోమూత్రం యొక్క విశిష్టతను కరోనా సమయంలో ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ప్రభుత్వంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు దేశీయ ఆవులను సంరక్షిచడంతో పాటు వాటి సంతతిని పెంపొదించడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఒగ్గు పూజారులను, యాదవ సంఘం నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాయిత రాజ్ కుమార్ యాదవ్, సమ్మయ్య, యాదగిరి, జక్కుల పరశురాములు, శోభ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
లేగదూడకు బారసాల..
RELATED ARTICLES
Recent Comments