కత్తులు, కొడవళ్లతో దాడులు
స్పాట్ వాయిస్, క్రైం: భూ తగాదా ముగ్గురి ప్రాణం తీసింది. మరో ముగ్గురు కొనఊపిరితో కొట్టుమిట్టాడేలా చేసింది. ఈ విషాద ఘటన ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం జక్కులపల్లిలో సోమవారం మధ్యా్హ్నం చోటు చేసుకున్నది. భూతగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. దీంతో ఓ వర్గంపై ప్రత్యర్థి వర్గం గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ సైతం ఉన్నది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని, వారిని మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతులను మండల లింగయ్య, మండల నరసయ్య, గిరుగుల బక్కమ్మగా గుర్తించారు. ఘటనలో మండల సంతోష్, మండల దుర్గయ్య గాయపడ్డారు. మధ్యాహ్నం సమయంలో జక్కులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న భూమిలో ఈ ఘర్షణ జరిగిందని, ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లినట్లు సమాచారం. దాడిలో దాదాపు 15 మంది కలిసి ఓ వర్గంపై దాడికి పాల్పడ్డట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Recent Comments