Monday, November 25, 2024
Homeటాప్ స్టోరీస్'ధర్మ'మేనా.. సార్...?

‘ధర్మ’మేనా.. సార్…?

అన్యాయంగా భూములు తీసుకోవద్దు..
నోటికాడి బువ్వ లాక్కోవద్దు..
మొగలిచర్ల రైతులు వినతి..
ఎమ్మెల్యే చల్లా ఇంటి ఎదుట ఆందోళన
ధర్మారెడ్డిని ముట్టడించిన అన్నదాతలు..
కుడా కార్యాలయం ముట్టడి..
కలెక్టరేట్ లో కూడా ఆందోళన

స్పాట్ వాయిస్, హన్మకొండ: పరకాల నియోజకవర్గంలోని మొగిలిచర్ల రైతులు హన్మకొండలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసం ఎదుట గురువారం ఆందోళన చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు కింద భూ సేకరణలో తమ పచ్చని పంట పొలాలు పోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ల్యాండ్ పూలింగ్ పేరిట తమ పంట భూములు లాక్కోవద్దంటూ ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. ఎట్టి పరిస్థితుల్లో పంటలు పండే భూములను ఇచ్చేది లేదని భీష్మించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చొరవ తీసుకుని వెంటనే ల్యాండ్ పూలింగ్ సర్వేను ఆపేయించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చల్లా రైతులకు నచ్చజెప్పేందుకు ఎంతగానో యత్నించారు. ఒక దశలో రైతులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. కన్న తల్లుల్లాంటి భూములను లాక్కోవడానికి మనస్సెలా ఒప్పుతోందని ప్రశ్నించారు. ఈ విషయమై ఎమ్మెల్యే బాధిత రైతులకు ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా రైతులు వినిపించుకోకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒక దశలో చల్లా ధర్మారెడ్డితో రైతులు వాగ్వాదానికి దిగారు. కనీసంగా తమకు సమాచారం కూడా ఇవ్వకుండా పంట భూములను సర్వే చేయడంపై మరింతగా మండిపడ్డారు. తీవ్ర అసహనంతో ఉన్న రైతులు చివరకు ఆందోళనకు దిగడంతో ఎమ్మెల్యే తీవ్ర అసహనానికి గురై అక్కడ నుంచి వెళ్లిపోయారు.

భూ దిగ్బంధం..
కాగా, తాతల కాలం నుంచి వస్తున్న పంట భూములను తీసుకుంటే బతుకేదెలా అని రైతులు ఆందోళనకు దిగడంతో అధికారులు తెలివిగా వ్యవహరిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ఉన్న కొంత భూమిని ఇవ్వమని మొండికేస్తే ల్యాండ్ ఫూలింగ్ పేరుతో చుట్టూ ఉన్న స్థలాలను తీసుకుని రైతుల భూముల్లోకి వెళ్లకుండా దారులు మూసేస్తున్నారంటున్నారు. ఏ దారి లేకపోతే చివరకు భూములు ఇవ్వడమే గతి అని ఒకానొక దశలో రైతులే బతిమిలాడి తమ భూములు తీసుకొండనే చేస్తున్నారు. ఇలా తమకు చెందిన భూములను తమచేతే వదులుకునేలా చేసి, తమకు తీవ్ర నష్టాన్ని తీసుకొస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ల్యాండ్పూలింగ్ను వెంటనే ఆపాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని మొగలిచర్ల అన్నదాతలు హెచ్చరిస్తున్నారు.

కుడా కార్యాలయం ఎదుట ఆందోళన..
ల్యాండ్ ఫూలింగ్ కు వ్యవసాయ భూములు ఇచ్చేదే లేదని గురువారం ఆరెపల్లి, మొగిలిచర్ల, గొర్రెకుంట, పోతురాజుపల్లి, కొత్తపేట, పైడిపల్లి తదితర విలీన గ్రామాల రైతులు కుడా (కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) కార్యాలయాన్ని ముట్టడించారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను అపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆ సందర్భంగా రైతులు హెచ్చరించారు. చివరకు రైతులకు కుడా పీవో అజిత్ రెడ్డి నచ్చజెప్పి వినతిపత్రం తీసుకున్నారు.

రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో..
ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆరెపల్లి గాంధీ విగ్రహం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జీడబ్ల్యూఎంసీలో విలీనమైన గ్రామాల్లో ఇప్పటికీ వ్యవసాయమే ప్రధానంగా జీవనం సాగిస్తున్నాయని, అకస్మాతుగా ప్రభుత్వం బంగారు పంటలు పండే భూములను లాక్కుంటే తమ గతి ఏంటని సమితి అధికారులను నిలదీసిం. రియల్ ఎస్టేట్ కోసం మాత్రమే అన్యాయంగా పేద రైతుల భూములను లాక్కుంటున్నారని, ఇది ఎంత మాత్రం క్షమించరాని విషయమని రైతు ఐక్య కార్యాచరణ సమితి దుయ్యబట్టింది.

కలెక్టరేట్ లో వినతి..
ల్యాండ్ ఫూలింగ్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు వరంగల్ కలెక్టరేట్ లోపల ఆందోళన చేశారు. అక్కడ ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నా రైతులు నిలువరించడం వారి తరం కాలేదు. కొందరు రైతులు చాంబర్ లోపలికి వెళ్లి నినాదాలు చేశారు. కలెక్టర్ బయటకు వచ్చి రైతుల బాధ వినాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కోసం వ్యవసాయ భూములను లాక్కోవడం అన్యాయమని, రైతుల పొట్ట కొట్టొద్దని నినాదాలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments