Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్మంత్రి కేటీఆర్ కోసం... ఓ తల్లి గోస..

మంత్రి కేటీఆర్ కోసం… ఓ తల్లి గోస..

 బిడ్డ ప్రాణాల కోసం మంత్రి కేటీఆర్ ను కలవాలని ఆరాటం..
పొద్దంతా మండెటెండలో మంత్రి కోసం పడిగాపులు
అడ్డుకుంటున్న స్థానిక నేతలు, పోలీసులు
కన్నీటి పర్యంతమైన తొర్రూరు ఆడబిడ్డ

స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్ : బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ తల్లి పడుతున్న ఆరాటమిది. అనారోగ్యంతో బాధపడుతున్న పసిప్రాయాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీద పెట్టి భరోసా తీసుకోవాలనే అమ్మ తాపత్రయమిది. నాలుగు రోజుల్లో మన రామన్న వస్తాడని తెలిసిన నుంచి కొండకెదురు చూసినట్టు చూస్తోంది. అనుకున్నట్టు మంత్రి కేటీఆర్ బుధవారం వస్తుండడంతో ఆనందపడింది. ఎలాగైనా తారక రామున్ని కలిసి తన బిడ్డ పరిస్థితి తెలుపుకుందామని ఏడుగంటలకే హన్మకొండలో నిరీక్షణ షురూ చేసింది. రోజంతా మంత్రి ఎటు వెళ్తే అటు వెళ్లడమేగానీ, మంత్రిని కలిసే భాగ్యం మాత్రం ఆ తల్లికి కలుగలేదు. స్థానిక నాయకులు, పోలీసులు ఆ అమ్మకు కేటీఆర్ ను కలిసే అదృష్టాన్ని దక్కనివ్వలేదు. అత్యుత్సాహానికి పోయి ఆమెను మంత్రి ఉన్న దరిదాపుల్లోకే రానివ్వలేదు. మండుటెండలో దాహమేసినా నీళ్లు తాగడానికి వెళ్తే ఎక్కడ మంత్రిని కలిసే అవకాశం చేజారుతుందోనని ఆ అమ్మ ఎండుకపోతున్న గొంతుతోనే ఆర్తించింది. ఒళ్లంతా చెమలు కారుతున్నా, తినకపోవడంతో కళ్లు మూసుకుపోతున్నా ఆ అమ్మ మాత్రం మంత్రి కోసం అర్తించడం ఆపలేదు. మండుటెండలో బోరున విలపిస్తూ, కనిపించిన ప్రతి వారి కాళ్లు మొక్కుతూ వేడుకున్నా ఆ మాతృవేదనను ఎవరూ పట్టించుకోలేదు. ఆపదలో ఉన్నా సారు తప్పకుండా ఆదుకుంటాడని ఒక్కసారి కలువనివ్వడంటూ ప్రాధేయపడినా.. కేటీఆర్ ను కలిసేందుకు కాన్వాయ్ దగ్గరకు వెళ్లినా ఆమెను పక్కకు లాగేశారు. కనీసం ఆ ఆడబిడ్డను పలకరిద్దామన్న ఆలోచన కూడా ఏ నాయకుడు చేయకపోవడం అత్యంత విషాదకరం. మంత్రి కేటీఆర్ పర్యటనలో చోటు చేసుకున్న హృదయాల్ని మెలిపెట్టే ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

తొర్రూరు మండలం పట్టిపురం గ్రామానికి చెందిన శైలజ జీవనం కోసం హన్మకొండకు వచ్చి నివాసం ఉంటున్నాడు. ఈమెకు మూడేళ్ల బాబు ఉన్నాడు. అతను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రొటిన్ సమస్య వచ్చిందని, కాళ్లు, ముఖం వాపు వచ్చిందని బాధితురాలు వాపోయింది. ఆపదంటే స్పందించే మంత్రి కేటీఆర్ ను కలిస్తే బిడ్డ బతుకుతాడనే ఆశతో ఆ తల్లి ఉదయం నుంచి కేటీఆర్ పర్యటనలో కాళ్లరిగేలా తిరుగుతోంది. సార్ ను కలిస్తే మెరుగైన వైద్యం అందిస్తాడని ఆశపడింది. కలిసిన వారినల్లా సార్ ను ఒక్కసారి కల్పించండంటూ కన్నీటి పర్యంతం అయింది. అయినా ఫలితం లేకుండా పోయింది. మధ్యాహ్నం ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే అరూరి నివాసంలోని భోజనం విరామం ఉంటే అక్కడికీ వెళ్లింది. అయినా రామన్న చూపు ఆమెపై పడలేదు. పడలేదు అనేకంటే స్థానిక నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు రామన్న చూపును ఆ తల్లిపై పడనివ్వలేదనే చెప్పాలి. నా బాధ మనస్సున్న రామన్నకు చేరేదెలా అంటూ ఎమ్మెల్యే గేటు ఎదుట కన్నీరుమున్నీరుగా రోదించడం హృదయాలను మెలిపెట్టింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments