Tuesday, November 26, 2024
Homeజిల్లా వార్తలు10 నుంచి కొత్తకొండ జాతర..

10 నుంచి కొత్తకొండ జాతర..

ఈ నెల 10 నుంచి కొత్తకొండ జాతర..

ఏర్పాట్లు ఘనంగా చేయాలి.. 

మంత్రి పొన్నం ప్రభాకర్ 

అధికారులతో సమీక్ష..

స్పాట్ వాయిస్, భీమదేవరపల్లి: ఈ నెల 10 వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల (జాతర)ను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసి విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో 10వ తేదీ నుంచి జరగనున్న జాతర, ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కళ్యాణ మండపంలో జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

సమన్వయంతో పనిచేయాలి..

కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామికి విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. ఆలయం చారిత్రకమైనదని, ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, రోడ్లు భవనాలు, విద్యుత్తు, దేవాదాయ, పర్యాటక తదితర శాఖల అధికారులు బాధ్యతగా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. వీరభద్ర స్వామి ఆలయం ఎంతో చారిత్రాకమైనదని, దేవాలయ ప్రతిష్ట గ్రామానికి, మండలానికి, జిల్లాకు పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తెలియాలన్నారు. దేవాలయ అభివృద్ధికి రాజకీయాలకతీతంగా కృషి చేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. జాతర ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. దేవాలయ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్యను పెంచాలని, నిరంతరం వైద్య సేవలు అందేలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆలయం చుట్టూ పలు మండలాలకు చెందిన గ్రామాలున్నాయని వారికి ప్రాధాన్యం ఉండేలా కృషి చేస్తామన్నారు. వీఐపీ దర్శనం కోసం భక్తులు రూ.50, రూ.100 టికెట్ ను ఏర్పాటు చేస్తే దేవాలయ అభివృద్ధితోపాటు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అవకాశంగా ఉంటుందన్నారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రభుత్వం ఆలయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జాతరలను వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తుందన్నారు. కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయం ముఖ్యమైన పుణ్యక్షేత్రమని, భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ తగినన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ముళ్లపొదలు లేకుండా చేసి, ప్రమాదాలు జరగకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ మాట్లాడుతూ వీరభద్ర స్వామి ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments