Sunday, May 19, 2024
Homeటాప్ స్టోరీస్పెద్దల సభకు ఉద్యమ సారథి

పెద్దల సభకు ఉద్యమ సారథి

పెద్దల సభకు ఉద్యమ సారథి

ఎమ్మెల్సీ గా ప్రొఫెసర్ కోదండ రామ్

గవర్నర్ కోటాలో నామినేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఏకం చేసిన నేతగా గుర్తింపు

మహోజ్వల ఘట్టాలకు నాయకత్వం 

అణగారిన వర్గాల హక్కుల గొంతుకకు సముచిత గౌరవం 

 

స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణ ఉద్యమ సారథి, సకల జన సేనాని, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పెద్దల సభకు ఎంపికయ్యారు. గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయగా.. గవర్నర్ తమిళిసై గురువారం ఆమోద ముద్ర వేశారు. హక్కుల ఉద్యమం నుంచి ఎదిగి తెలంగాణ ఉద్యమాన్ని ఏకతాటిపై నడిపిన నేతగా పేరున్న ఆయనకు బీఆర్ఎస్ సర్కార్ లో సముచిత గౌరవం లభించకపోగాక పలు సందర్భాల్లో అవమానాలకు గురయ్యారు. అణగారిన వర్గాల హక్కుల గొంతుకకు కాంగ్రెస్ సర్కార్ సముచిత గౌరవం కల్పించడంతో ఉద్యమకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

హక్కుల ఉద్యమం నుంచి మొదలై..

ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పని చేసిన ముద్దసాని కోదండరాం స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న ముద్దసాని వెంకటమ్మ, ఎం.జనార్దన్ రెడ్డి దంపతులకు జన్మించిన ఆయన కాజీపేటలోని సెయింట్ గ్రాబ్రియల్ స్కూల్‌ లో టెన్త్ వరకు చదివారు. డిగ్రీ హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో, పీజీ(పొలిటికల్ సైన్స్) ఓయూలో, ఎంఫిల్ జేఎన్ యూలో, పీహెచ్ డీ ఓయూలో పూర్తి చేశారు. జేఎన్ యూలో ఎంఫిల్ చేసేటప్పుడు విద్యార్థుల సమస్యలపై ఆయన నిరాహర దీక్ష చేశారు. ఓయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాక ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం(ఏపీసీఎల్సీ), మానవ హక్కుల వేదిక(హెచ్ఆర్ఎఫ్)లో క్రియాశీలకంగా పని చేశారు.

అనేక సమస్యలు వెలుగులోకి ..

ఆదివాసీల సమస్యలు, పటాన్ చెరు, జీడిమెట్ల చిన్నపరిశ్రమల కార్మికుల వెతలు, మెదక్, మహబూబ్ నగర్ కరువు ప్రాంతాల్లో ఆకలి చావులు, సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వరంగల్ పత్తి రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసి అనేక విషయాలను కోదండరాం వెలుగులోకి తెచ్చారు. జంతు వధకు పాల్పడుతున్న అల్ కబీర్ కంపెనీ వ్యతిరేక ఉద్యమంలో ముందుండి నడిచారు. ఓయూ ప్రొఫెసర్ రమామేల్కొటే శిష్యుడిగా పేరున్న ఆయన ఆదివాసీల ససమ్యలపై దివంగత హక్కుల నేత బాలగోపాల్తో,  బియ్యాల  జనార్దన్ రావు కలిసి పని చేశారు. ఆ తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. దేశంలో ఆహార భద్రత సమస్యపై పనిచేసిన సుప్రీంకోర్టు కమిషనర్‌కు సలహాదారుగా కూడా పనిచేశారు. పోలవరంలో ముంపునకు గురవుతున్న ఆదివాసీల పక్షాన పోరాడారు. దివంగత ప్రొఫెసర్ జయశంకర్‌తో సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతో ప్రత్యక్షంగా కలిసి పనిచేశారు.

మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం..

ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసిన అనేక సంస్థలను స్థాపించి, కలిసి పనిచేశారు. తెలంగాణలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, కుల సంఘాల సమాహారమైన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ)కి 2009 నుంచి రాష్ట్రం వచ్చేవరకు నాయకత్వం వహించారు. ఉద్యమ క్రమంలో అప్పటి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఇష్టం లేకపోయినా మిలియన్ మార్చ్, సాగర హారం లాంటి మహత్తర ఘట్టాలకు కోదండరాం పిలుపునిచ్చారు. సహాయ నిరాకరణ, వంటావార్పు, సాగరహారం వంటి కార్యక్రమాలకు ఆయన సారథ్యంలోనే జరిగాయి. 2018లో తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేసి.. టీఆర్ఎస్ సర్కార్ పై అనేక ఉద్యమాలు నిర్వహించారు. నిరుద్యోగ సమస్యపై కోదండరాం పాదయాత్రకు పిలుపునిస్తే.. పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసి తలుపులు పగులగొట్టి అవమానకరంగా అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ సర్కార్ విధానాలను నిరసిస్తూ అనేక సార్లు పార్టీ ఆఫీసులో, ధర్నా చౌక్ లో ఆయన సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, వీఆర్ఏలు, అంగన్ వాడీలు, మహిళలు, టీచర్లు తదితర అనేక సెక్షన్ల తరఫున గొంతుకై నిలిచారు. టీఆర్ఎస్ సర్కార్ పై ప్రత్యక్ష ఆందోళనలు చేస్తూనే హైకోర్టులో అనేక కేసులు వేయించి న్యాయం కోసం కొట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ఇచ్చి ప్రచారం చేశారు. ఎన్నికల ముందు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలో భాగంగా ప్రొఫెసర్ కోదండరాంకు ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments