డైమండ్ జూబ్లీ.. లెక్క తప్పింది..
కేఎంసీ 60 ఏళ్ల వేడుకల నిర్వహణపై అనుమానాలు
మొక్కుబడి గానే పనులు..
అకౌంట్ లేకుండానే ఉత్సవాల ఆర్థిక లావాదేవీలు..
వివరాలు చూపాలంటున్న పలువురు వైద్యులు..
స్పాట్ వాయిస్, హన్మకొండ : కాకతీయ మెడికల్ కళాశాలలో మొదటి బ్యాచ్ 1959లో ప్రారంభమైంది. 2020లో కేఎంసీ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలకు ముస్తాబు చేశారు. ప్రత్యక్షంగా పాల్గొనే వారు పాల్గొన్నారు.., సమయం లేని ఎన్ఆర్ఐలు తమ వంతుగా చదివిన కళాశాలకు విచ్చలవిడిగా డొనేట్ చేశారు. తాము ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం కేఎంసీ అనే అభిమానంతో లక్షలకు లక్షల రూపాయలు పంపించారు. కళాశాలలో మెరుగైన వసతులు కల్పించాలని, అదనంగా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని, వాటికి కావాల్సిన ఖర్చుల కోసం ఎవరికి తోచినంత వారు ఉత్సవ కమిటీకి పంపించారు. ఈ లెక్కన సుమారు అలా వచ్చిన ఫండ్సే దాదాపు రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.
వేదికైన కేఎంసీ..
అంతా మెడికల్ విద్యార్థులు. అందునా దేశవిదేశాల్లో స్థిరనివాసాలు ఏర్పర్చుకున్నారు. చదివిన చదువుతో అంతా బాగానే సెటిల్ అయ్యారు. నిద్ర లేచింది మొదలు, మళ్లీ పడుకునే వరకూ నిత్యం ప్రజలకు వైద్యసేవలు అందిస్తూ బిజీ బిజీ జీవితాలు గడపడం దినచర్యగా అయిన వారు. అలాంటి వారంతా ఒకే వేదికగా కలవాలనుకుని నిర్ణయం తీసుకోవడం సాహసమే. దానికి వారికి చదువులు పంచిన కళాశాల మా తల్లి డైమండ్ జూబ్లీ వేడుకే వేదికైంది. పని ఒత్తిళ్లు పక్కనపెట్టి అంతా వీలు కల్పించుకుని ఉత్సవాలకు తరలిరావాలని నిర్ణయించుకున్నారు.
ఖండాంతరాల్లో విద్యార్థులు..
కాకతీయ మెడికల్ కళాశాలలో చదివిన మెడికల్ విద్యార్థులు ఖండాంతరాల్లో స్థిరపడ్డారు. ఇప్పటి వరకు సుమారు పదివేల మంది విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వెళ్లారు. అందులో దాదాపు వెయ్యికి పైగా డాక్టర్లుగా, నిపుణులైన వైద్యులుగా విదేశాల్లోనే సెటిల్ అయ్యారు. కళాశాలకు దేశవ్యాప్తంగా కూడా ఎంతో గొప్ప గుర్తింపు. అందులో విద్యను అభ్యసించిన వారు గొప్పగొప్ప హోదాల్లో ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కాకతీయ మెడికల్ కళాశాలలో చదవడం అంటేనే ఓ అదృష్టంగా, అందులో సీటు సంపాదించడం అంటే సువర్ణ అవకాశంగా భావిస్తుంటారు.
లెక్కలు ఎక్కడ..?
ఎంతో ఉన్నతమైన ఆశయంతో మొదలు పెట్టిన ‘డైమండ్’ వేడుకలు. అంతా కలిసి కళాశాల రూపురేఖలు కొంతలో కొంతైనా మార్చాలనే సదాశయం. ఎవరికి తోచినంత వారు విరాళాలు అందజేశారు. 1972 కాకతీయ మెడికల్ కళాశాల బ్యాచ్ వైద్యులే సుమారు రూ.10 లక్షలు పంపించారు. ఆడిటోరియం కోసం తమ నిధులు ఖర్చు చేసి పేర్కొన్నారు. కళాశాలకు గుండెకాయ మాదిరిగా ఉండే ఆడిటోరియంలో మరమ్మతులు చేయడం, మోడ్రన్ గా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కానీ, దానికి అంతగా మెరుగులు దిద్దిన దాఖలాలు కనిపించడం లేదు. పైగా, వారు పంపించిన డబ్బులకు లెక్కలు కూడా ఎక్కడా కనిపించవు. యశోదా ఆస్పత్రి యాజమాన్యం కాకతీయ మెడికల్ కళాశాల వసతుల మెరుగు కోసం రూ.లక్షల్లో వెచ్చించి పనులు చేయించింది. చివరకు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా చేపట్టిన పనుల లెక్కల్లోనే యశోదా దవాఖాన చేయించిన పనులు జమ చేశారు. వారు వెచ్చించిన పనుల జాబితాను వీళ్లు చేయించినట్టుగా లెక్కల్లో రాసుకున్నారు.
ఎంఐడీసీకి ఎందుకివ్వనట్టో..
తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ ఎంఐడీసీ ) కళాశాలలో జరిగే అభివృద్ధి పనులకు తనవంతుగా తక్కువ ఖర్చుతో చేస్తామని ముందుకొచ్చింది. కళాశాల పనుల జాబితాను సిద్ధం చేసుకుని అప్పగిస్తే ప్రారంభం చేయడానికి కూడా రెడీ అయ్యింది. కానీ, ఏం జరిగిందో ఏమోగానీ కార్పొరేషన్ కు ఒక్క పని కూడా అప్పగించలేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పనులు చేయించుకునే అవకాశాలు ఉన్నా, ఆ దిశగా బాధ్యులు ఆలోచన చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అప్పగిస్తే తమకు కావాల్సిన వాటిని కోల్పోవాల్సి వస్తుందనా.., లేదంటే మరేమైనా ఇతర ప్రయోజనాలు ఆశించోగానీ ఎలాంటి పనులు మెడికల్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు అప్పగించలేదు.
నాణ్యత డొల్ల..
మెడికల్ కళాశాల అభివృద్ధి కోసం ఎక్కడెక్కడో స్థిర పడిన వైద్యులు పంపిన డబ్బులతో చేపట్టిన పనులు కూడా అంతగా నాణ్యతా ప్రమాణాలు పాటించిన దాఖలాలు లేవు. సుమారు రూ.రెండు కోట్ల వరకు వచ్చిన డబ్బులతో కళాశాలలో ఎన్నో పనులు చేయించే అవకాశాలు ఉన్నా, మొక్కుబడిగా జరిపి చేతులు దులుపుకున్నారు. కళాశాల అవసరాలకు హాస్టళ్లు, లైబ్రరీ సదుపాయం, పాత వాటికి మరమ్మతులు, పెరుగుతున్న అవసరాలను దృష్టిలోపెట్టుకుని మెరుగుపర్చాల్సిన వసతులు లెక్కకు మించి ఉన్నాయి. కానీ, డబ్బులతో చేసింది తక్కువంటే చాలా తక్కువే. ఇప్పటికి కళాశాల హాస్టళ్లు పాతకాలపువే ఉన్నాయి. బాలికల హాస్టళ్లు అయితే మరీ భయంకరంగా ఉన్నాయి. కనీస వసతులు లేకుండా, రక్షణ వలయాలు ఏమీ కనిపించకుండా దర్శనమిస్తున్నాయి. గతంలోనే కళాశాల పూర్వ విద్యార్థి, పేరెన్నికగల డాక్టర్ లక్కిరెడ్డి అనిమిరెడ్డి కేఎంసీ ఆవరణలో లేడీస్ హాస్టల్ కట్టించారు. డెవలప్ మెంట్ ఫండ్స్ తో కనీసం వాటినైనా బాగు చేయించిందీ లేదు. అవే శిథిలావస్థకు చేరుకున్న గదులు, అపసోపాలు పడి గడపాల్సిన వసతులు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల నిర్వహణపై ఆందోళన చెందుతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు చేయించాలని వేడుకుంటున్నారు. ఆడపిల్లలను అడవిలో ఉంచిన ఫీలింగ్ అనిపిస్తోందని, కనీసంగా నగర నడిబొడ్డున ఉన్న కళాశాలకు మెరుగైన వసతులు కల్పిస్తే బాగుంటుందని కోరుతున్నారు.
విజ్ఞాన ప్రదర్శన లెక్కలూ అంతే..
కళాశాల ఉత్సవాల వేళ వైద్య విజ్ఞాన ప్రదర్శన జరిగింది. కేవలం మెడికల్ సెక్టార్ వారే కాకుండా పలు వివిధ రంగాల నుంచి వేలాదిగా హాజరయ్యారు. స్కూల్, కళాశాలల యాజమాన్యాలు కూడా పిల్లలను ప్రదర్శనకు తీసుకెళ్లాయి. ఎంట్రెన్స్ కోసం ప్రత్యేకంగా టిక్కెట్లు కూడా ఇష్యూ చేశారు. స్వచ్ఛందంగా పలువురు విరాళాలు కూడా రాశారు. ఇందులో కూడా వేటికి సరైన లెక్కలు లేవు. డైమండ్ జూబ్లీ వేడుకలకు సేకరించిన ఏ నిధులకూ లెక్కలు లేవు. ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తీసుకున్న దాఖలాలు కూడా లేదు. చెక్కులు ఏ ఖాతాలో జమ చేసిందో కూడా తెలియదు. చేపట్టిన పనులకు లెక్కలు రాయలేదు. ఎవరెవరు ఎంతిచ్చారు.., ఏ ఏ పనికి ఎంత ఖర్చు చేశారు.. అనే డిస్ ప్లే బోర్డులు కూడా లేవు. డబ్బులు పంపిన వారికి రశీదు ఇచ్చినట్టు కూడా ఎక్కడా లేదు., డబ్బుల్లో నుంచి కట్టాల్సిన జీఎస్ టీ లెక్కలు కూడా లేవు. అన్నీ వ్యవహారాలు నమోదు చేసే పాస్ బుక్కు జాడ కూడా లేదు. కానీ, అన్నింటికి కలిపి కాకి లెక్కలు చూపించి తూతూ మంత్రంగా ఆడిట్ లెక్కలు చూపించారనే విమర్శలున్నాయి. కనీసంగా కాలేజ్ అకౌంట్ కూడా లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారంటేనే ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏదిఏమైనా డైమండ్ జూబ్లీ వేడుకల నిర్వహణ వేళ వచ్చిన నిధుల్లో కోతపడిందని, 2020 ప్రిన్సిపాల్ అకౌంట్లోకి దారి మళ్లి ఉంటాయని పలువురు డాక్టర్లు పేర్కొంటున్నారు.
చొరవ చూపాలి..
కేఎంసీలో జరిగిన డైమండ్ జూబ్లీ వేడుకల నిర్వహణ వ్యయాల విషయమై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, హన్మకొండ కలెక్టర్ చొరవ తీసుకుని, లెక్కలు తారుమారు చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించాలని పలువురు డాక్టర్లు కోరుతున్నారు. వచ్చిన విరాళాలు, చేసిన ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలు అందరికీ తెలిసేలా డిస్ ప్లే బోర్డులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఆ దిశగా ఆలోచన చేయాలంటున్నారు. నిర్వహణ కమిటీ సభ్యులకు తెలియకుండా ఇదంతా జరుగుతుందంటే నమ్మశక్యంగా ఉండదని, వారి ప్రమేయం పై కూడా దృష్టి సారించాలని వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు డాక్టర్లు కోరుతున్నారు.
Recent Comments