Wednesday, December 4, 2024
Homeతెలంగాణఏం చేసినవ్ కేసీఆర్..

ఏం చేసినవ్ కేసీఆర్..

లీకేజీ జరిగినా నోరు మెదపవెందుకు..?
మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాల్సిందే..
టీఎస్ పీస్సీ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
నిరుద్యోగ మార్చ్ లో రాష్ట్ర సర్కార్ పై ధ్వజం
కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమేయాల్సిందేనని పిలుపు

‘అన్నం తినడానికి పైసల్లేక, ఒక్క అరటిపండు కొనుక్కుంటే ఇంకోటి ఫ్రీ గా వస్తదని ఆశతో ఉద్యోగ వేటలో రోజులు గడుపుతున్న నిరుద్యోగులను చూస్తుంటే బాధేస్తోంది. అవ్వయ్య కష్ట పడుతాంటే జేబుల్ల డబ్బుల్లేక మధ్యాహ్న భోజనం మానేసిన యువతను తలుచుకుంటే కడుపు తరుక్కపోతాంది. ఇంటికి ఫోన్ చేస్తే ఏమైంది బిడ్డా అని తల్లిదండ్రులు అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక నెలలకు నెలలు రూముల్లోనే మగ్గుతూ, కన్నఊరును మరువలేక బాధను దిగమింగుకోవడానికి కడుపుల తల్కాయపెట్టి ఏడ్చుస్తున్న యువత ఉసురు కేసీఆర్ సర్కార్ కు తప్పకుండా తాకుద్ది..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హన్మకొండలో తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ ను ఉద్దేశించి ఆయన అంబేద్కర్ సెంటర్ లో యువతను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. త్వరలోనే రాష్ట్రం నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమేయబోతున్నామని, యువత ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
స్పాట్ వాయిస్, బ్యూరో

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మార్చ్‌తో ఓరుగల్లు కాషాయమయమైంది. భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు సహా ముఖ్య నేతలు నిరుద్యోగ మార్చ్‌లో పాల్గొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బండి సంజయ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ యువత భవిష్యత్ ను నాశనం చేస్తున్నారన్నారు. 30 లక్షల మంది యువత భవిష్యత్ ను పాడుచేశారని ఆరోపించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అయితే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. పేపర్ లీకేజీపై సిట్ తో కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అప్పుడే వారి బండారం బయటపడుతుందన్నారు. పేపర్ లీకేజీపై విద్యార్థులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని..మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని పేపర్ల లీకులకూ బండి సంజయ్ కారణమని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నటికైనా ప్రజల సమక్షంలో సమాధానం చెప్పక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇంట్లో కార్యక్రమం ఉందని చెప్పినా అరెస్ట్ చేశారని.. కేసిఆర్ ఇంట్లో వారంతా దందాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్ ఎస్సీ తప్పు లేకుంటే సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తప్పు లేకపోయిన ఈటలను బయటకు పంపారని గుర్తు చేశారు. విద్యార్థులు, యువత భవిష్యత్తు కోసం బీజేపీ పోరాడుతోందన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్కు అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారని మండిపడ్డారు. ఒక్కసారి కూడా కేసీఆర్ అంబేద్కర్ వర్ధంతి, జయంతికి హాజరు కాలేదని గుర్తు చేశారు.


బీజేపీ రావడం ఖాయం
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే రాష్ట్రంలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఏటా జాబ్ కాలెండర్‌ను రిలీజ్ చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుద చేస్తామన్నారు. లిక్కర్ స్కాంలో బిడ్డ దొరికితే ఆమెపై చర్యలు తీసుకోరని.. పేపర్ లీకేజీలో కేటీఆర్ హస్తం ఉన్నా ఏమీ అనరన్నారు. కానీ దళిత నేత రాజయ్యను మాత్రం ఏ తప్పు చేయకున్నా…మంత్రి పదవి నుంచి తీసివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ విచారణ అంటే చాలు.. కేసీఆర్ అనేక సాకులు చెప్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. 30 లక్షల మంది యువత ఇబ్బందిపడితే ప్రగతి భవన్ నుంచి బయటకు రారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత చదువుకుంటే ప్రశ్నిస్తారని..ఉద్యోగాలు అడుగుతారని అందుకే వర్సిటీలను నిర్వీర్యం చేశారన్నారు.

సీఎం ఉన్నది.. దోచుకోవడానికే..: ఈటల
సీఎం కేసీఆర్‌ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని, కేసీఆర్ దోచుకోవడానికే ఉన్నారని, మన కోసం లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదిచుకోవాలన్నారు. తూ తూ మంత్రంగా నోటిఫికేషన్లు వేశారని విమర్శించారు. కొన్ని రోజులైతే కేసీఆర్ సర్కార్ గంగలో కలుస్తుందని విమర్శించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫీజ్ పీకే వరకూ ఈ ఉద్యమం ఆగదన్నారు. బీజేపీ కేసులకు భయపడదన్నారు. పోలీస్ స్టేషన్లలో ఎవడెవడు ఏం చేస్తున్నాడో అన్ని రికార్డులు రాస్తున్నామన్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కుటుంబం కోసం మాత్రమే ముఖ్యమంత్రి ఆలోచిస్తారని విమర్శించారు. విద్యార్థులు సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments