చీల్చి చెండాడాలి..
అసెంబ్లీకి నేను వస్తున్నా..
ప్రజావ్యతిరేక పనులపై కాంగ్రెస్ ను నిలదీయాలి..
14నెలల్లోనే రూ.1.5లక్షల కోట్ల అప్పు..
మాజీ సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ ఎల్పీలో దిశానిర్దేశం
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి సభకు హాజరుకావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలన్నారు. బీఆర్ఎస్పై ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలన్నారు. హామీల అమలులో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు, ఆస్తుల గురించి వివరించిన కేసీఆర్ పదేళ్లలో బీఆర్ఎస్ రూ.4 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. కాంగ్రెస్ 14 నెలల్లోనే రూ.1.5 లక్షల కోట్ల అప్పు చేసిందని, అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. భారీగా అప్పులు చేసినా హామీలు అమలు చేయట్లేదని, రైతుబంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడో వంతు సమయం పూర్తయిందని, ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చామని, ప్రజల సమస్యలపై దూకుడుగా వెళ్లాలని కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వం విఫలమైందని, నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అసెంబ్లీ, కౌన్సిల్లో పార్టీ ఉపనేతలను నియమిస్తామని అన్నారు. మహిళలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కొట్లాడాలని, ఆరు గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని కేసీఆర్ తెలిపారు. దళితబంధు నిలిపివేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, గొర్రెల పెంపకం, చేపల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రజల కష్టాలపై ఉభయసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చెప్పారు.
నేను వస్తున్న..
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం మూడు గంటలకు పైగా సాగింది. అసెంబ్లీ సమావేశాలకు తాను కూడా వస్తున్నానని పార్టీ ప్రతినిధులతో కేసీఆర్ అన్నారు. రేపట్నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
చీల్చి చెండాడాలి..
RELATED ARTICLES
Recent Comments