చెన్నై తీసుకెళ్తున్న పోలీసులు
ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలుగు ప్రజలపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై ఎగ్మోర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలు తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు ఇటీవల పోయెస్ గార్డెన్లోని కస్తూరి ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె సెల్ నంబరుకు ఫోన్ చేశారు. స్విచాఫ్ అని రావడంతో పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇక్కడికి వచ్చి అరెస్టు చేశారు. ఆమెను చెన్నైకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు.
కస్తూరి ఏమన్నారంటే…
ఈ నెల 3న చైన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి నటి కస్తూరి హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ..300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు.. ప్రస్తుతం ‘మాది తమిళ జాతి’ అంటున్నారన్నారు. ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై ఆమె మండిపడ్డారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దని.. ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండడంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందంటూ కస్తూరి విమర్శించారు. కస్తూరి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆమె క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు.
Recent Comments